
అక్షర విజేత సిద్దిపేట్
రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేయాలని, పట్టణ గ్రామీణ ప్ర్రాంతాలలో త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లకు సూచించారు.
మంగళవారం నాడు ఆమె రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోళ్లను, త్రాగునీటి ఇబ్బందులు కలుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తూ…. వచ్చే ఏప్రిల్ ఒకటవ తేదీన ప్రతి మండలంలో ఒక కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని, మిగతా కొనుగోలు కేంద్రాలను సత్వరమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు టెంట్ సౌకర్యం, త్రాగునీరు తదితర సౌకర్యాలు ఉండాలని, ధాన్యం కొనుగోళ్లకు కావలసిన గన్నీ బ్యాగులు, ప్యాడీ క్లీనర్స్, తేమ యంత్రాలు, తూకం యంత్రాలు, తదితర ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని, కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా చేపట్టి మిల్లులకు ప్రణాళికాబద్దంగా ధాన్యం చేరవేసేలా రవాణా వ్యవస్థ పకడ్బందీగా ఉండాలని తెలిపారు. కొనుగోళ్ల కేంద్రాలకు ఇన్చార్జీ అధికారుల పర్యవేక్షణతో రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోళ్లు నిర్వహించాలని సూచించారు. అంతరాష్ట్ర చెక్ పోస్టుల వద్ద నిఘా ఉంచాలని, ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే జిల్లాలకు కేటాయించిన సిఎంఆర్ లక్ష్యాలను సకాలంలో సాధించాలని సూచించారు.
అనంతరం త్రాగునీటిపై సమీక్షిస్తూ.. వేసవి కాలంలో త్రాగునీటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ త్రాగునీటి సరఫరాలో వచ్చే చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డు స్థాయిలో త్రాగునీటి సరఫరాకు ప్రణాళికలు తయారు చేసుకోవాలని, త్రాగునీటి పైప్ లైన్ లీకేజీలు అరికట్టాలని తెలిపారు. పనిచేయని బోరు బావులను, చేతి బోర్లను మరమ్మతులతో పునరుద్ధరించాలని, అత్యంత ప్రాధాన్యతతో త్రాగునీటి సరఫరా పనులు పూర్తి చేయాలని అన్నారు. త్రాగునీటి సరఫరాలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల చేసేందుకు సన్నద్ధం కావాలని అన్నారు. ప్రతి మున్సిపాలిటీలో చివరి వార్డ్, గ్రామాలలో చివరి ప్రాంతం వరకు త్రాగునీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి సరఫరాకు సంబంధించిన ప్రతి అంశాన్ని పర్యవేక్షించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో మున్సిపల్ ఇంజనీర్లు, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఇంజనీర్లు సమన్వయంతో త్రాగునీటి సక్రమ సరఫరా చేయాలని, నీటి లభ్యత, సరఫరాల పట్ల పూర్తి అవగాహన కలిగివుండాలని, సమస్యలు ఏర్పడే ప్రాంతాలను గుర్తించాలని, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, గ్రామ, మండల స్థాయి అధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణతో త్రాగునీటి సమస్యను అధిగమించాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమ అగ్రవాల్, జిల్లా సరఫరాల అధికారి తనూజా, సివిల్ సప్లయ్ డిఎం హరీష్, జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్, మిషన్ భగీరథ ఎస్ఇ శ్రీనివాసచారి, డిపిఓ దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు.