ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉరితాళ్లతో నిరసన

-భూ కబ్జాదారుల నుండి మా భూమిని రక్షించండి
-న్యాయం చేయకుంటే మాకు ఆత్మహత్యే శరణ్యం
అక్షర విజేత, మంచిర్యాల ప్రతినిధి:
అక్రమ పట్టాను రద్దుచేసి తమ భూమి తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ బెల్లంపల్లి ఆర్డీవో కార్యాలయం ఎదుట మంగళవారం ఉరితాళ్లతో జాడి తిరుపతి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. తమ భూమిని తమకు ఇప్పించి న్యాయం చేయని లేని యేడల తమకు ఆత్మహత్య శరణ్యమని జాడి తిరుపతి కుటుంబ సభ్యులు వాపోయారు. అనంతరం బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాడి తిరుపతి మాట్లాడుతూ బెల్లంపల్లి మండలం ఆకేనపల్లి గ్రామ శివారు సర్వేనెంబర్ 3 పైకి/పీ లో గల తమ రెండు ఎకరాల 75 సెంట్ల భూమిని సోమగూడెంకు చెందిన భూక్య రాంచందర్, మంచిర్యాల వాసి సత్యరాజ్ మరికొంత మంది దొంగ పత్రాలు సృష్టించి కబ్జా చేయడమే కాకుండా వేరే వాళ్లకు అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ భూమి 1956 నుండి తమ తాత దుర్గం లస్మయ్య ఆన్లైన్ లో ఉందని అట్టి భూమిని తాము పత్తి, వరి పంటలు వేస్తూ సాగు చేసుకుంటూ ఉండగా 2018లో భూక్య రామచందర్ ఆయన అనుచరులు మరి కొంతమంది భూమిని తమ తాత లాంటి పేరుగల మరో వ్యక్తి పేరుపై దొంగ పట్టా సృష్టించి ఆ భూమి తమదే అంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారని, ఇదేంటని ప్రశ్నించిన తమను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే తమ వాడేనని బెదిరింపులకు గురి చేశాడని ఆరోపిస్తూ వాపోయారు. తహసీల్దార్,ఆర్డీవో, జిల్లా కలెక్టర్ల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ తమకు న్యాయం జరగలేదని వారు అన్నారు. ఇప్పుడు ఆ భూమిని ఫ్లాట్లుగా మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ భూ కబ్జాదారులు అక్రమంగా అమ్మకాలు చేపట్టారని దీంతో ఉరితాళ్లతో నిరసన చేయాల్సి వచ్చిందని తెలిపారు. తమకు న్యాయవ్యవస్థపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ పై నమ్మకం ఉందని వారు స్పందించి తమ భూమి తమకు దక్కేలా చూడాలని, లేని పక్షంలో తమకు మరణమే శరణ్యమని వారు వాపోయారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ పట్టాను రద్దుచేసి, తమ భూమి తమకు పట్టా చేయించి న్యాయం చేయాలని వారు కోరారు.