టెక్నాలజీపై తిరుమల దృష్టి
అక్షరవిజేత,తిరుమల బ్యూరో:
తిరుమల శ్రీవారి ఆలయంలో, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు.. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను టీటీడీ వినియోగించుకోనుంది. గంటల తరబడి క్యూలైన్‌లో నిరీక్షించే అవసరం లేకుండా.. గంట.. రెండు గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఏఐ సహకారంతో ఫేస్ రికగ్నేషన్ ఎంట్రీ విధానాన్ని టీటీడీ బోర్డు సభ్యులు పరిశీలించారు.మొదటగా కియోస్కులో ఫేస్ (ముఖం) ఆధారంగా టోకెన్ జనరేట్ చేయడం, ఆ తర్వాత ఫేషియల్ రికగ్నేషన్ బ్యారియర్ గేట్ ముందు నిలబడితే.. గేట్లు తెరుచుకోవడం వంటి వాటిని పరిశీలించారు. మెరుగైన విధానాలను పరిశీలించి, త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తేనున్నారు. దీని ద్వారా భక్తులు గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చునే బాధ తప్పనుంది. సమయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చు.తిరుమలను ఆదర్శ తీర్థయాత్ర కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో టీటీడీ విజన్ 2047 రూపొందించింది. దీంట్లో భాగంగా.. సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆలయ పరిపాలన, తిరుమలలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానంగా దృష్టి పెడుతోంది.వ్యవస్థలు వసతి బుకింగ్, దర్శనాన్ని సులభతరం చేస్తాయని అధికారులు భావిస్తున్నారు. వేగవంతంగా భక్తులకు సేవలు అందిచనచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తాయి. ఏఐ ఆధారిత సాధనాలతో యాత్రికులు సేవలకు సంబంధించి రియల్ టైన్ అప్‌డేట్స్ పొందవచ్చు. దీని ద్వారా కచ్చితమైన సమాచారం, స్పష్టత ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.విజన్ 2047 ప్రణాళికలో భాగంగా.. తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో.. ఆలయ పవిత్రతను కాపాడటానికి టీటీడీ కట్టుబడి ఉంది. యాత్రికుల అవసరాలను తీర్చడానికి సాంకేతికతను వినియోగిస్తున్నా.. తిరుమల ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కాపాడుకోవడమే తమ లక్ష్యమని టీటీడీ స్పష్టం చేస్తోంది.