
విజేత,ఆసిఫాబాద్ ప్రతినిధి: తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు షఫీ ఉల్లా బేగ్, ఉపాధ్యక్షుడు ఎర్ర రాజశేఖర్ లకు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ షకీల్ ఘనంగా సన్మానించారు.తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన షఫీ ఉల్లా బేగ్, జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఎర్ర రాజశేఖర్‌లను శుక్రవారం కాగజ్‌నగర్‌లో అబ్దుల్ షకిల్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించి, నూతన బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా అబ్దుల్ షకిల్ మాట్లాడుతూ, షఫీ ఉల్లా బేగ్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన కృషికి, అంకితభావానికి గుర్తింపుగా భావించవచ్చని పేర్కొన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతం నుంచి సాధారణ రిపోర్టర్‌గా తన జర్నలిజం ప్రస్థానాన్ని ప్రారంభించి, నేడు జిల్లా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడి స్థాయికి ఎదగడం అభినందనీయమని అన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధన, వారి సంక్షేమం కోసం ఆయన చేపట్టిన ఉద్యమాలు, కార్యక్రమాలు ఎంతో ప్రాధాన్యత కలిగినవని కొనియాడారు. జర్నలిస్టులు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని అబ్దుల్ షకిల్ పేర్కొన్నారు. అటువంటి జర్నలిస్టుల సమస్యలను గుర్తించి, వారి హక్కుల పరిరక్షణకు జర్నలిస్ట్ సంఘాలు నిరంతరం కృషి చేయాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు షఫీ ఉల్లా బేగ్, ఉపాధ్యక్షుడు ఎర్ర రాజశేఖర్ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ జర్నలిస్టుల అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ సన్మాన కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షఫీ ఉల్లా బేగ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్ర రాజశేఖర్, జమీల్ తదితరులు పాల్గొన్నారు.








