అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగజ్జీవన్ రామ్
అక్షర విజేత,రెంటచింతల
నాటి సమాజంలో విద్యకు దూరమై దుర్భర జీవితం గడుపుతున్న పీడిత దళిత దీన జనుల కోసం శ్రమించిన సంస్కరణల యోధుడు బాబు జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని,ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దండే శివయ్య అన్నారు. శుక్రవారం మండల తెదేపా కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మండల తెదేపా అధ్యక్షుడు చపారపు అబ్బిరెడ్డి, సుమంత్ రెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మామిడి రవిలతో కలిసి జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు,మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని,దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.అంటరానితనం, కుల నిర్మూలనకు వ్యతిరేకంగా జగ్జీవన్ రామ్ పోరాడి, దళితుల అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారని కొనియాడారు. ఎస్సీ సెల్ అధ్యక్షుడు రవి మాట్లాడుతూ దళితుల హక్కులను రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిస్తే వాటిని చట్ట రూపంలో తేవడానికి జగజ్జీవన్ రామ్ చేసిన కృషి మరుపురానిదన్నారు. దళిత ప్రజలందరూ ఐకమత్యంతో విద్యను ఆయుధంగా మలుచుకుని ఆర్థిక స్వావలంబన సాధించి, ఆత్మగౌరవంతో బ్రతకటానికి కృషి చేయడమే ఆయనకు జాతి సమర్పించే నిజమైన నివాళి అన్నారు. కాగా మరో చోట జరిగిన కార్యక్రమంలో కన్నెగంటి హనుమంతు సేవా సంఘం నిర్వాహకులు, విద్యావేత్త నారాయణపురం శ్రీను పాల్గొని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. సామాజిక,రాజకీయ ఉద్యమాలను ఏకకాలంలో నడిపిన యోధుడిగా జగ్జీవన్ రామ్ చిరస్మరణీయుడన్నారు. దేశ చరిత్రలో బాపూజీ గా ప్రజలు పిలుచుకునే ఇద్దరు నాయకుల్లో ఒకరు మహాత్మా గాంధీ కాగా మరొకరు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు.ఉప ప్రధాని,కార్మిక, రక్షణ శాఖ మంత్రిగా దేశ అభివృద్ధి ప్రదాతగా జగ్జీవన్ రామ్ జీవితం ఆదర్శప్రాయమన్నారు.దేశ స్వరాజ్యంతో పాటు దేశ పునర్నిర్మాణంలో జగ్జీవన్ రామ్ ఎంతో కీలకపాత్ర పోషించారన్నారు. కడు పేద కుటుంబంలో జన్మించిన ఆయన అంకుఠిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగారన్నారు.28 ఏళ్ల వయసులోనే 1936లో బీహార్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయ జీవితం ప్రారంభించి భారత పార్లమెంటులో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించారన్నారు.సామాజిక సమానత్వం కోసం అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని సమరం సాగించిన విప్లవ యోధుడు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు.బడుగు బలహీన వర్గాల భవితకు అంబేద్కర్, జగ్జీవన్ రామ్ లు ఆనాడే పునాదులు వేశారన్నారు. జాతి జనులను విద్యావంతులుగా,ఆత్మాభిమానం కలవారిగా చేయాలన్నదే తన లక్ష్యంగా సామాజిక న్యాయ సాధకుడుగా జగ్జీవన్ రామ్ శ్రమించారన్నారు. ఆయన ఆశయ సాధనలో భాగంగా రాజ్యాంగం కల్పించిన హక్కులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ అభివృద్ధి బాటలో నిలవాలని ఆకాంక్షించారు. ఆయా కార్యక్రమాల్లో మూలిరాజారెడ్డి, రామకృష్ణ,అప్పయ్య, మరియు దాస్,కె. రంగనాయకులు, ముక్తేశ్వరరావు, గుర్రం మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.