బాబు జగ్జీవన్ రామ్ అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం పోరాడిన గొప్ప వ్యక్తి,
దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం
జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్
ఒకసారి విజేత జోగులాంబ గద్వాల ప్రతినిధి
అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అన్నారు. శుక్రవారం ఐ.డి.ఓ.సి ఆవరణలో ఎస్సి సంక్షేమ శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్. బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి కార్యక్రమానికి అదనపు కలెక్టర్లు అపూర్వ చౌహాన్, ముసిని వెంకటేశ్వర్లుతో కలిసి చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బాబు జగ్జీవన్ రామ్ వివక్షత లేని సమాజం కోసం పోరాటం చేశారన్నారు. ఆయన చిన్నతనం నుండే రాజకీయాలలో రాణిస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఉప ప్రధాని స్థాయికి ఎదిగారన్నారు. చదువుకుంటేనే సమాజంలో గౌరవం పెరుగుతుందని, ఆర్థికంగాను అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందన్నారు. ఈయన ఆశయాలు నెరవేరాలంటే ప్రతి ఒక్కరు విద్యావంతులు కావాలని, విద్య మాత్రమే మానవ ప్రగతికి ఏకైక ఆయుధమని వివరించారు.
అంటరానితన్నాని నిర్మూలించి అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించేందుకు తన జీవితాంతం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. నేటి రోజును యావత్ దేశ వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు జరుపుకోవడం ఆయనకు మనం అందించే గౌరవం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఓ వీర భద్రప్ప , జెడ్పి సి.ఈ.ఓ కాంతమ్మ, బి.సి, ఎస్సి సంక్షేమ శాఖ అధికారిణి శ్వేతా ప్రియదర్శిని, డి.ఆర్.డి.ఓ నర్సింగ రావు, స్వీప్ నోడల్ అధికారి రమేష్ బాబు, జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.