తాగునీటి సరఫరాలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకూడదు


… అధికారులతో సమీక్షలో జిల్లా ప్రత్యేక అధికారి శరత్
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి
తాగునీటి సరఫరాలో ఎక్కడ కూడా ప్రజలకు ఏ చిన్నపాటి ఇబ్బంది సైతం తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం ఆయన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి తాగునీటి సరఫరా తీరుతెన్నులపై మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, మిషన్ భగీరథ, ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీర్లు, ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో తాగునీటి సరఫరా పరిస్థితి గురించి సంబంధిత అధికారులు స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి శరత్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి సరఫరా అంశం అత్యంత కీలకమైనదని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా తీరును అనునిత్యం క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షించాలని సూచించారు. ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తితే అనుమతుల కోసం వేచి చూడకుండా యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అన్నారు. అవసరమైన చోట చేతి పంపులు, బోరు మోటార్లు, పైప్ లైన్ ల మరమ్మతులు వంటివి సకాలంలో చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, నీటి ఎద్దడి కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారనే మాటకు తావులేకుండా బాధ్యతాయుతంగా, అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. అవసరమైన చోట వ్యవసాయ బోరుబావులను అద్దెకు తీసుకోవాలని, ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేనిపక్షంలో చివరి ప్రయత్నంగా నీటి రవాణా కోసం ట్యాంకర్లను వినియోగించాలని తెలిపారు. అద్దె ట్యాంకర్ల వినియోగం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, వాటి వినియోగానికి సంబంధించిన పూర్తి వివరాలను స్పష్టమైన ఆధారాలతో రికార్డులలో పొందుపర్చాలని సూచించారు. జిల్లాలోని 33 మండలాల పరిధిలో గల 792 నివాస ప్రాంతాలకు ప్రధానంగా శ్రీరాంసాగర్, సింగూరు నుండి తాగునీటి లభ్యత ఉండగా, పై రెండు జలాశయాల్లోనూ సరిపడా నీటి నిలువలు అందుబాటులో ఉన్నందున తాగునీటి విషయమై ప్రజలు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రధానంగా మంచి నీటి సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు హితవు పలికారు. మండల ప్రత్యేక అధికారులతో పాటు తహసీల్దార్లు, ఎంపిడిఓలు, ఎంపీఓలతో కూడిన బృందాలను క్లస్టర్ అధికారులుగా నియమిస్తూ క్షేత్ర స్థాయిలో నీటి సరఫరా తీరును అనునిత్యం పర్యవేక్షణ జరపాలని సూచించారు. వాట్స్అప్ గ్రూప్ లను ఏర్పాటు చేసుకుని మంచి నీటి వ్యవస్థ తీరుతెన్నులను నిశితంగా సమీక్షించుకోవాలని అన్నారు. మండల స్పెషల్ ఆఫీసర్లుగా నియమించబడిన జిల్లా స్థాయి అధికారులు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తూ, ఎక్కడైనా లోపాలు గమనించిన వెంటనే వాటిని సరిదిద్దాలని, తాగునీటి వ్యవస్థకు ఇబ్బంది తలెత్తకుండా అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని మార్గనిర్దేశం చేశారు. మంచి నీటి వ్యవస్థ తీరుతెన్నుల నిశిత పరిశీలనకై జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా మిషన్ భగీరథ ద్వారా పూర్తి స్థాయిలో నిర్ణీత పరిమాణంలో నీటి సరఫరా జరుగుతోందా లేదా అన్నది మండల అధికారులు, గ్రామ పంచాయతీల కార్యదర్శులు సరిచూసుకోవాలని అన్నారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పని చేస్తూ ప్రస్తుత వేసవిలో ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి సమస్య తెరపైకి రాకుండా నిబద్దతతో పని చేయాలని సూచించారు. నీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, తాగునీటి సరఫరా పర్యవేక్షణకై జిల్లా అధికారులను మండల స్పెషల్ ఆఫీసర్లుగా నియమించడం జరిగిందన్నారు. మున్సిపల్ పట్టణాలలో బల్దియాల కమిషనర్లు, గ్రామాలలో గ్రామ పంచాయతీల కార్యదర్శులు పర్యవేక్షణ జరిపేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లాలోని 33 మండలాలు, నాలుగు మున్సిపల్ పట్టణాలలో 792 నివాస ప్రాంతాలు ఉండగా, వాటిలో 37 నివాస ప్రాంతాలలో నీటి కొరతను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతేకాకుండా ఆయా చోట్ల నీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నామని, అవసరమైన చోట బోరు మోటార్లు, హ్యాండ్ పంపులు, ఇతర తాగునీటి వనరులకు మరమ్మతు పనులు జరిపిస్తున్నామని అన్నారు. జిల్లా స్థాయి అధికారులు మారుమూల ప్రాంతాలను సైతం సందర్శిస్తూ ప్రజలతో మమేకమై నీటి సరఫరా తీరుతెన్నుల గురించి వారి ద్వారా క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని సూచించారు. ప్రస్తుత వేసవి సీజన్ దృష్ట్యా మిషన్ భగీరథ, ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులకు కూడా సెలవులు రద్దు చేస్తున్నామని, ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున ఇప్పటికే ఎంపిడిఓలు, తహసీల్దార్లకు సెలవులు రద్దు చేయబడ్డాయని కలెక్టర్ గుర్తు చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, ట్రైనీ కలెక్టర్ కిరణ్మయి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.