భక్తి ప్రపత్తులతో మాత గోవిందమాంబ ఆరాధనోత్సవం
అక్షర విజేత,రెంటచింతల
మండల కేంద్రమైన రెంటచింతలలోని గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో బ్రహ్మంగారి సహధర్మచారిణి గోవిందమాంబ ఆరాధనోత్సవాన్ని భక్తజనం బుధవారం భక్తి ప్రపత్తులతో కన్నులపండువగా నిర్వహించారు. ఆలయంలోని మాత గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి అర్చనామూర్తులకు గంగ, పంచామృతం,క్షీరం,ఫలోదకంలతో అభిషేకం చేశారు.అనంతరం ప్రత్యేక వస్త్రాలంకరణ చేసి స్వామి,మాతల గుణగణాలను కీర్తిస్తూ,108 నామాలతో స్తుతిస్తూ సహస్ర నామార్చన కార్యక్రమం నిర్వహించారు.ఉదయం ప్రభాత సేవ, గణపతి పూజ,పుణ్యాహవచనం, అభిషేకం, కుంకుమార్చనలు తదితర పూజలు మధ్యాహ్నం నైవేద్యం, మంత్రపుష్ప,నీరాజన తీర్థ ప్రసాద వినియోగం, పులిహోర భక్తులకు పంపిణీ చేశారు.అర్చకులు కొండూరి మధుసూదనాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన విశేష పూజల్లో భక్తులు విరివిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పూజా దంపతులు వేములూరి వెంకటాచారి,రుక్మిణి దేవి,మోడేపల్లి వెంకటాచారి, చెన్నుపాటి నరసింహాచారి,నవులూరి శ్రీనివాసాచారి, తంగిళ్ళపల్లి లక్ష్మీ నరసింహాచారి,వడ్లమాను విశ్వరూపాచారి తదితర విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు.