బెల్లంపల్లి వాసి గజెల్లి మోహన్ కు నంది పురస్కారం
– 30 ఏళ్లుగా చేస్తున్న సేవలకు గాను గుర్తింపు
– శిఖర ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో పురస్కారానికి ఎంపిక
– హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రదానం
అక్షర విజేత, మంచిర్యాల ప్రతినిధి:
బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంపు బస్తీకి చెందిన సామాజిక సేవా కార్యకర్త గజెల్లి మోహన్ కు ప్రతిష్టాత్మక నంది పురస్కారం దక్కింది. శిఖర ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో సేవలందిస్తున్న వారికి ఈ పురస్కారాలను అందిస్తున్నారు. ఈ మేరకు గత 30 ఏళ్లుగా బెల్లంపల్లి పట్టణంలో విశిష్ట సేవలు అందిస్తున్న మోహన్ ను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ మేరకు హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గజెల్లి మోహన్ కు నంది పురస్కారాన్ని అందజేశారు.
మూడు దశాబ్దాల సేవకు గుర్తింపు
గజెల్లి మోహన్ బెల్లంపల్లి పట్టణంలో గత 30 సంవత్సరాలుగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్ గా, ప్రోగ్రామ్ ఆఫీసర్గా, సంఘమిత్ర యూత్ క్లబ్, జన విజ్ఞాన వేదిక, లోక్సత్తా, తెలంగాణ విద్యావంతుల వేదిక, టీజేఏసీ మరియు పలు స్వచ్ఛంద సేవా సంస్థలకు ప్రతినిధిగా, సలహాదారునిగా, గజెల్లి చారిటబుల్ ట్రస్టు నిర్వాహకునిగా పలు బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అనేక అవార్డులు పొందారు. బెస్ట్ సోషల్ వర్కర్, బెస్ట్ యూత్ అవార్డు, బెస్ట్ టీచర్ అవార్డు, బెస్ట్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ అవార్డు, సిటిజన్ ఆఫ్ ఏపీ అవార్డు, బాబు జగ్జీవన్ రామ్ పురస్కారం లాంటి అనేక అవార్డులు పొందారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి గజెల్లి మోహన్
గజెల్లి మోహన్ యాంకర్ గా, అధ్యాపకునిగా, సోషల్ వర్కర్ గా, ఉద్యమకారునిగా వివిధ సంఘాలలో విభిన్న పాత్రలు పోషించారు. ఈ క్రమంలో ఈ “ఆప్త” అవార్డును గవర్నర్ ఎండి తివారి చేతుల మీదుగా అందుకున్నారు. బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డు కూడా పొందారు. 40 సార్లకు పైగా రక్తదానం చేశారు. సొంతంగా లైబ్రరీ నిర్వహణ చేపట్టారు. సామాజిక కార్యక్రమాలైన హరితహారం, అక్షరాస్యత, గుడుంబాపై అవగాహన, మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వీటన్నిటిని పురస్కరించుకొని ఆయనను నంది పురస్కారం వరించడం పట్ల అటు కుటుంబ సభ్యులు ఇతర వివిధ సంస్థల వారు ఆయనను అభినందిస్తున్నారు. ఈ మేరకు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అధ్యాపకునిగా పనిచేస్తున్న గజెల్లి మోహన్ ను ప్రిన్సిపల్ డాక్టర్ టిఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యాపకుల సమక్షంలో అభినందించారు.