ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలు….!
*జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
*అక్షర విజేత, భీమవరం:
మంగళవారం స్థానిక కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్ నందు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించి బ్యాంకుల నుండి సమాచారాన్ని అందజేయడంపై జిల్లా కలెక్టర్ బ్యాంకర్లతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్-324 ప్రకారం ఎన్నికల ప్రచారంలో అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించి బ్యాంకుల నుండి సమాచారం పొందవచ్చు అన్నారు. గత రెండు నెలల్లో రూ.95 వేలకు మించి డిపాజిట్ లేదా ఉపసంహరణకు సంబంధించి సరైన కారణం లేని లావాదేవీల సమాచారాన్ని అందజేయాలని కోరారు. నియోజకవర్గంలోని అనేక మంది వ్యక్తుల ఖాతాలకు ఒక బ్యాంకు ఖాతా నుండి RTGS ద్వారా ఎలాంటి పూర్వాపరాలు లేకుండా అసాధారణంగా బదిలీలకు సంబంధించిన వివరాలు కూడా అందజేయాలన్నారు. సీఈఓ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్న విధంగా అభ్యర్థులు, జీవిత భాగస్వామి, అతనిపై ఆధారపడిన వారి బ్యాంక్ ఖాతా నుండి రూ.1 లక్ష విత్ డ్రా చేసిన వారి వివరాలను పొందుపరచాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో రాజకీయ పార్టీ రూ.1 లక్ష కంటే ఎక్కువ నగదు డిపాజిట్ వివరాలు అందజేయాలన్నారు. ఓటర్లకు లంచం ఇవ్వడానికి ఉపయోగించబడే ఏవైనా ఇతర అనుమానాస్పద నగదు లావాదేవీలు దృష్టికి వస్తే తెలియజేయలన్నారు. బ్యాంకర్ల అందజేసిన సమాచారం పై సంబంధిత అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు సి.వి.ప్రవీణ్ ఆదిత్య, జిల్లా రెవిన్యూ అధికారి జె.ఉదయ భాస్కర రావు, లీడ్ బ్యాంకు మేనేజరు ఎ.నాగేంద్ర ప్రసాదు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, ఎలక్షన్స్ సూపర్డెంటు సి.హెచ్.దుర్గా ప్రసాదు, డిప్యూటీ తహాశీల్దారు యం.సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.