మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
అక్షర విజేత, మంచిర్యాల ప్రతినిధి:
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాలలకు కొమ్ముకాస్తూ మాదిగలకు పార్లమెంట్ టికెట్లు కేటాయించకుండా మోసం చేస్తుందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య మాదిగ విమర్శించారు. రాష్ట్రంలోని మూడు రిజర్వుడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్లమెంట్ టికెట్ కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ దాని అనుబంధం సంఘాల ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన తెలియజేశారు. అనంతరం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సమ్మయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంటు సీట్లు ఉండగా అందులో మూడు రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయని అందులో ఒకటి కూడా మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ కేటాయించకుండా మాదిగలను అవమానిస్తుందని అన్నారు. రాష్ట్రంలో 80 లక్షల జనాభా కలిగిన మాదిగ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించి మాలలను నెత్తిన పెట్టుకొని మాదిగలను తొక్కి పెట్టడం సరికాదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేసి మాదిగలకు రెండు పార్లమెంటు స్థానాలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రం అంతటా ఆందోళనలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఇంచార్జ్ కల్వల శంకర్ , ఎంఆర్పీఎస్,ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్, ఎంఎంజె నాయకులు పాల్గొన్నారు.