తాగునీటి కొరతకు ప్రత్యేక చర్యలు
అక్షర విజేత సిద్దిపేట్
సోమవారం హైదరాబాద్ నుంచి తాగునీటి సరఫరా, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, వడదెబ్బ నివారణ చర్యలపై అధికారులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ….
తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా గ్రామాల వారీగా కలెక్టర్లు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు. అవసరం ఉన్నచోట బోర్ వెల్స్, పైప్ లైన్స్ వేయించాలని సూచించారు. ఏప్రిల్, మే, జూన్ వరకు స్థానికంగా ఉన్న బోర్వెల్స్, వ్యవసాయ బావులను తాగునీటి అవసరాలకు వాడుకోవాలని పేర్కొన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి కొరతను అధిగమించేందుకు వాటర్ ట్యాంకర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎక్కడ తాగునీటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు అధికారులు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా స్పెషల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటూ పరిస్థితిని సమీక్షించాలని పేర్కొన్నారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను సిఎస్ సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు చేపట్టాలని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గన్నీ సంచుల కొరత లేకుండా చూడాలని, రైతులకు మద్దతు ధర కల్పించే విషయంలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. తేమ శాతం విషయంలో రైతులకు అధికారుల అవగాహన కల్పించాలని సూచించారు. ఆయా జిల్లాల్లో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ ను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం పనికి రాదని తెలిపారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అన్ని కల్పించి ఉత్తమంగా తీర్చిదిద్దాలని సిఎస్ తెలిపారు. ఈ అంశంలో జిల్లా కలెక్టర్లు కీలకపాత్ర పోషించాలని సూచించారు. వేసవి సెలవులు పూర్తయ్యేలోగా పనులన్నీ కంప్లీట్ కావాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సరఫరా, టాయిలెట్స్, అదనపు భవనాల నిర్మాణం, విద్యుత్ సరఫరా, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఇందుకు 70 రోజుల వరకు సమయం ఉందని, ఈ లోగా పనులన్నీ పూర్తి కావాలని తెలిపారు. గ్రామాలు, మండలాల వారీగా పాఠశాలల్లో ఎస్టిమేట్ తయారు చేసి పనులను త్వరగా ప్రారంభించాలని పేర్కొన్నారు. పనులు నాణ్యతతో చేపట్టాలని, ఇందుకు ఇంజినీరింగ్ అధికారులు తరచూ పనులు పర్యవేక్షించాలని సూచించారు. మొత్తానికి ప్రభుత్వ పాఠశాలలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని, డీఈవో లు ప్రత్యేక చొరవ చూపాలని పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు.
వడదెబ్బ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోండి. ఉత్తర తెలంగాణ జిల్లాలో టెంపరేచర్ పెరిగిపోతున్నదని, వడదెబ్బ నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సిఎస్ సూచించారు. ఇందుకు గ్రామాల వారీగా ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించారు. ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ సేవలందించాలని పేర్కొన్నారు. ఉపాధి కూలీలు పనిచేసే చోట మౌలిక వసతులు కల్పించాలని, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, జనసంచారం ఉన్నచోట ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. వడదెబ్బ బారిన పడిన వారికి తక్షణం వైద్య సేవలందించాలని, తర్వాత హాస్పిటల్ కు తరలించాలని సూచించారు. ఈ మేరకు మందులు, ఫ్లూయిడ్స్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లో ఆశా కార్యకర్తలతో ఓఆర్ ఎస్ ప్యాకెట్లు ప్రజలకు అందించాలి. ఎండలో అత్యవసర పనులకు వెళ్లే వారు క్యాప్, గొడుగు, వాటర్ బాటిల్ తీసుకొని వెళ్లాలని సూచించారు. ఈ మేరకు ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి. వేసవి తాపం నుంచి రక్షణ పొందేందుకు పండ్ల రసాలు, ఓఆర్ఎస్, నిమ్మరసం తరచూ తీసుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందుకెళ్లాలని పేర్కొన్నారు.
ఈ వీడియో కాన్పరెన్స్ కార్యక్రమం కి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి, అదనపు కలెక్టర్లు గరిమా అగ్రవాల్, శ్రీనివాస్ రెడ్డి, డీఆర్డీఏ పీడి జయదేవ్ ఆర్యా, జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీఈవో శ్రీనివాస్ రెడ్డి, డీపీఓ దేవకి దేవి, పౌరసరఫరాల డిఎం హరీష్, డీసీఎస్ ఓ తనూజ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ శ్రీనివాస చారి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.