తప్పుల తడకగా సింగరేణి భూసేకరణ సర్వే..
అక్షర విజేత ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో..
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో ఏర్పాటు కాబోతున్న గోలేటి మెగా ఓసి కి అనుబంధంగా 58.09 ఎకరాల అదనపు భూ సేకరణ నోటిఫికేషన్ రెవెన్యూ శాఖ విడుదల చేసింది. అనంతరం భూసేకరణ ప్రక్రియ హుటాహుటిన నిర్వహించారు. ఈ క్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు వ్యవసాయ భూములలో పంట లేని సమయంలో సర్వే చేయడం వల్ల నిజమైన భూ యజమానుల బదులు ఇతరులు బీడు భూములలో ఫోటోలు దిగి భూసేకరణ లో లబ్ధి పొందబోతున్నారు దీంతో నిజమైన భూ యజమానులకు భూమి విస్తీర్ణాన్ని తక్కువ చేసి రెవెన్యూ అధికారులు రైతులతో దోబూచులాడుతున్నారు.
ప్రాజెక్ట్ ఆఫీస్ కొరకు తీసుకొనే భూమిలో అత్యంత నిరుపేదలు, దళితులు ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గతంలో పట్టా పాస్ బుక్ ల కొరకు రెవెన్యూ అధికారులను సంప్రదించగా అటవీ మరియు రెవెన్యూ వివాద భూమిగా ధరణిలో నమోదయిందని పట్టాలు ఇవ్వకుండా రెవెన్యూ విభాగం కాలయాపన చేశారు. ఆర్ అండ్ బి అధికారులు సైతం గృహనిర్వసితులు లేని సమయంలో ఇంటి కొలతలు తీసుకోవడం, సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) విషయంలో కూడా సింగరేణి ఎస్టేట్ విభాగం అధికారిణీ మాత్రమే ఎంక్వైరీ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. రెవెన్యూ, ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యం వల్లే బాధిత రైతులకు జీవనోపాధి ,పునరావాసం రాకుండా పోయిందని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. సింగరేణి అధికారులు మాత్రం భూసేకరణలో కీలక ఘట్టమైన అవార్డు ప్రక్రియ పూర్తయ్యే విధంగా దళారులను రంగంలోకి దింపి రైతులను బెదిరిస్తూ కోర్టు కేసులు అయితే మీకు డబ్బులు రావని సంతకాలు సేకరించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవార్డు పాస్ అయితే సివిల్ కోర్టులో డబ్బులు డిపాజిట్ చేసి చేతులు దులుపుకోవాలని సింగరేణి అధికారులు వేచి చూస్తున్నారు