మిషన్ భగీరథ గేట్ వాల్ వద్ద జీపీ ట్యాంకర్లతో నీరు తోలకం
* ఇందుకు ఏడ్జెర్ల, గుర్రప్పతండ జీపీల ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
-ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆయా గ్రామాల ప్రజలు
అక్షర విజేత మరిపెడ:-
ప్రజలకు మిషన్ భగీరథ తాగునీటి సరఫరా చేస్తుంటే, మరికొందరు వారి స్వార్థ ప్రయోజనాల కోసం వేసవిలో ప్రజల దహర్తి తీర్చే నీటిని సీసీ రోడ్డు క్యూరింగ్కు ఉపయోగిస్తున్నారు. ఈ సంఘటపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎడ్జెర్ల గ్రామంలో చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉపాధి హామీ నిధులు ఎమ్మెల్యే ఇవ్వగా రూ. 5 లక్షల సీసీ రోడ్డు మంజూరు అయింది. సీసీ రోడ్డును దక్కించుకున్న కొందరు గుత్తేదారులు ఇట్టి రోడ్డు నిర్మాణాన్ని బుధవారం పూర్తి చేశారు. సీసీ రోడ్డు క్యూరింగ్ కోసం కాలనీకి సరఫరా అవుతున్న మిషన్ భగీరథ పైపు లైన్ గేట్ వాల్ ద్వారా నీటిని తోడుతున్నారు. తోడిన నీటిని ఎడ్జెర్ల, గుర్రప్పతండ గ్రామ పంచాయతీలకు చెందిన రెండు ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా మిషన్ భగీరథ నీటిని సీసీ రోడ్డుకు ఉపయోగిస్తున్నారు. ఓ పక్క వేసవి మొదలై తాగు నీరు లేక ఇబ్బందులు పడుతుంటే మరో పక్క ప్రభుత్వం సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ నీటిని సీసీ రోడ్డుకు ఉపయోగించడంపై ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్షంతోనే ఇంతటి దారుణం జరుగుతుందని, విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.