5 ఓట్లతో న్యాయవాది చిప్ప మనోహర్ విజయకేతనం
అక్షర విజేత, మంచిర్యాల ప్రతినిధి:
బెల్లంపల్లి పట్టణంలో గురువారం బార్ అసోసియేషన్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి న్యాయవాది చిప్ప మనోహర్, మరో న్యాయవాది చేను రవి కుమార్ పోటీ పడ్డారు. స్థానిక కోర్ట్ ఆవరణలో ఎన్నికల అధికారి కుమార్ జీవన్ పర్యవేక్షణలో ఈ ఎన్నికలు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు జరిగాయి. 5 గంటల వరకు ఓట్ల లెక్కింపు నిర్వహించారు. చిప్ప మనోహర్ కు 24 ఓట్లు రాగా, చేను రవి కుమార్ కు 19 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు ఇన్‌వాలిడ్ అయింది. 5 ఓట్లతో న్యాయవాది చిప్ప మనోహర్ అధ్యక్షులుగా విజయం సాదించారు. బార్ అసోసియేషన్‌లో మొత్తం 47మంది సభ్యులుండగా 44 మంది న్యాయవాదులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలలో ఉపాధ్యక్షులుగా కనుకుంట్ల రాజేష్, కోశాధికారిగా సునీల్ కుమార్ లు విజయం సాధించగా, ప్రధాన కార్యదర్శిగా సింగతి రాజేష్, సహాయ కార్యదర్శిగా దశారపు రాజు లు, ఈసీ మెంబర్ గా జుబేర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో సీనియర్, జూనియర్ న్యాయవాదులు ఎన్నికల్లో విజయం సాదించిన మనోహర్ కు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి అభినందించారు.
బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తా
తాను బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నిక కావడానికి సహకరించిన న్యాయవాదులందరికీ చిప్ప మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు. అయన మాట్లాడుతూ బార్ అసోసియేషన్ అభివృద్ధికి అందరి సహకారంతో పాటు పడుతానని పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ ఎన్నికలు అంటే కేవలం న్యావాదులకు సంబంధించిన ఎన్నికలు మాత్రమేనని కానీ ఈసారి కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్నికలలో జోక్యం చేసుకున్నారని, అలాంటి వ్యక్తులకు త్వరలోనే తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు.
బార్ అసోసియేషన్ ఎన్నికలు చెల్లవు-చేను రవి కుమార్
బెల్లంపల్లి కోర్టు ఆవరణలో గురువారం నిర్వహించిన బార్ అసోసియేషన్ ఎన్నికలు చెల్లవని అధ్యక్షుడిగా పోటీలో ఉండి ఓడిపోయిన చేను రవికుమార్ అన్నారు. ఏ ఎన్నికలు అయినా నోట అనే ఆప్షన్ కచ్చితంగా ఇవ్వాల్సి ఉండగా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అది లేకుండా చేశారని, కాబట్టి ఈ ఎన్నికలు చెల్లవన్నారు ఈ ఎన్నికలపై రాష్ట్ర అసోసియేషన్కు ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్నారు.