మనిషి యొక్కజీవితం జీవించడానికే ఆత్మహత్యలకు కాదు
* ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్
* ఎస్సై తహేర్ బాబాతో కలిసి కరపత్రాల ఆవిష్కరణ
అక్షర విజేత మరిపెడ:-
జీవితం జీవించడానికే నని,ఆత్మహత్యలకు పాల్పడవద్దని, కష్టాలు ఎదురై నప్పుడు ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలని ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్- డాక్టర్ పరికిపండ్ల అశోక్ పేర్కొన్నారు. మరిపెడ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటుచేసిన ఆత్మహత్యల పై జరిగిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ అశోక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే వ్యక్తుల పట్ల, సమాజం స్వాంతన చేకూర్చి మానసిక ధైర్యాన్ని నింపాలని, తనకి ఎవరూ లేరనే అగాధాన్ని పూడ్చే ప్రయత్నంతో భరోసా నింపాలని, కష్టాల్లో ఉన్న వ్యక్తికి తనకు ఉన్న అన్ని దారులు మూసుకు పోయినప్పుడు, ఆత్మహత్య ప్రయత్నం అనే దారి తెరుచుకుంటుందని, ఆ ప్రమాదకర క్షణంలో మేమున్నామంటూ భరోసానిస్తే బయటపడతారని తెలిపారు. మరిపెడ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ తహేర్ బాబా మాట్లాడుతూ ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ గత పది సంవత్సరాలుగా ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తూ ఇప్పటివరకు 28 మందిని కాపాడటo అభినందనీయమని తెలిపారు. అనంతరం పాల్గొన్న వారిచే ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరిస్తామని, ఆత్మహత్యలు చేసుకోబోమని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సెకండ్ ఎస్.ఐ.గండ్ర సంతోష్ కుమార్,ఆరోగ్య మిత్ర సంస్థ సూరత్, ప్రతినిధి చలమల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.