అక్షర విజేత, మంచిర్యాల ప్రతినిధి:
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి కృషి విజ్ఞాన కేంద్రం, బెల్లంపల్లి శాస్త్రవేత్తల బృందం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, జగిత్యాలలో నిర్వహిస్తున్న 2 రోజుల ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కృషి విజ్ఞాన కేంద్రం, బెల్లంపల్లి ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డా. కోట శివకృష్ణ మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో పండిస్తున్న పంటల సాగు ప్రణాళిక, వచ్చే సీజన్ లో పాటించవలసిన సాగు విధానాల పైన శాస్త్రవేత్తలు, రైతులు చర్చించి వచ్చే వానాకాలం యాసంగి పంటలలో సమగ్ర సాగు విధానాలకు రూపకల్పన చేయటం జరిగిందని తెలిపారు. ఈ సందర్బంగా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో వ్యవసాయంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రైతులు పెంటయ్య, మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలానికి చెందిన సండ్రోనిపల్లి గ్రామ ఆర్గానిక్ రైతు, వరి పంటలో సేంద్రీయ పద్దతిలో సాగు చేస్తూ పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు, జీవ శిలీంద్రాలను ఉపయోగిస్తూ భూసారాన్ని కాపాడుకుంటూ రసాయనిక క్రిమిసంహారకాలను వాడకుండా పర్యావరణానికి హాని కలగకూడదనే ఉద్దేశ్యంతో నూతన వ్యవసాయ సాంకేతికతపైన దృష్టి సారిస్తూ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సలహాలతో అధిక దిగుబడులు సాధిస్తూ, ప్రతీ సంవత్సరం వరి, పెసర, మినుము పంటలలో చిరుసంచులు సాగుచేస్తూ వ్యవసాయ విశ్వవిద్యాలయ నూతన రకాలకు ప్రాచుర్యం కల్పిస్తూ, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరింపచేస్తూ, పెట్టుబడిని నియంత్రించుకుంటూ, అధిక ఆదాయాన్ని సాధిస్తూ, తోటి రైతులకు సేంద్రీయ పద్దతిలో వ్యవసాయ సలహాలను అందిస్తూ, ఆర్ధిక స్థితిగతులలో పురోగాభివృద్ధి సాధించేలా తోడ్పాటునందిస్తూ జిల్లా రైతాంగానికి ఆదర్శంగా నిలిచినందుకు వడాయి శంకర్, రెబ్బెన మండలానికి చెందిన గంగాపూర్ గ్రామ యువరైతు, ఎప్పటికప్పుడు వ్యవసాయంలో వస్తున్న నూతన సాంకేతికతపైన దృష్టి సారిస్తూ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సలహాలతో గత సంవత్సరం అధిక సాంద్రత ప్రత్తి సాగు చేసి, సమగ్ర ఎరువుల, కలుపు, చీడ పీడల యాజమాన్యాన్ని చేపట్టి పెట్టుబడిని నియంత్రించుకుంటూ ఒక ఎకరానికి 16 క్వింటాల చొప్పున దిగుబడి సాధించడంతో పాటు ప్రతీ సంవత్సరం వరిలో చిరుసంచులు సాగుచేస్తూ విత్తనముగా తోటి రైతులకు అందచేస్తూ వ్యవసాయ విశ్వవిద్యాలయ నూతన రకాలకు ప్రాచుర్యం కల్పిస్తూ, వినూత్న పద్ధతుల్లో కూరగాయల సాగు చేపడుతూ, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరింపచేస్తూ అధిక ఆదాయాన్ని సాధిస్తూ తోటి రైతుల ఆర్ధిక స్థితిగతులలో పురోగాభివృద్ధి సాధించేలా తోడ్పాటునందిస్తూ జిల్లా రైతాంగానికి ఆదర్శంగా నిలిచినందుకుగాను గౌరవ సత్కారాన్ని యూనివర్సిటీ అధికారులు డా. వెంకటరమణ, రిజిస్ట్రార్, పిజెటియస్ఏయూ, డా. రఘురామి రెడ్డి, పరిశోధన సంచాలకులు, పిజెటియస్ఏయూ, డా. సుధారాణి, విస్తరణ సంచాలకులు, పిజెటియస్ఏయూ డా. శ్రీనివాస్, సహ పరిశోధన సంచాలకులు, ఆర్.ఏ.ఆర్ఎస్ జగిత్యాల చేతుల మీదుగా పొందారు.