కొడగు జిల్లాలో నిజామాబాద్ కు చెందిన దంపతుల ఆత్మహత్య
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రి నగర్ కు చెందిన దంపతులు కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. నగరంలోని గాయత్రి నగర్ కు చెందిన మేడవరపు రాజు (53) ఆయన సతీమణి మేడవరపు స్వాతిలు చాలా రోజుల క్రితం కర్ణాటకలోని కొడగు జిల్లాలో స్థిరపడ్డారు. అక్కడ ఒక లాడ్జిలో బుధవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. లాడ్జి యజమాని ఫిర్యాదు మేరకు సోమవార్ పేట్ ఎస్సై రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని లాడ్జి గది తలుపులు బద్దలు కొట్టడంతో ఆత్మహత్య విషయం వెలుగు చూసింది. అక్కడి పోలీసులు నిజామాబాద్ నగర సీఐ నరహరికి సమాచారం అందించారు. స్థానికంగా మేడవరపు రాజు, కుటుంబ సభ్యుల కొసం ఆరా తీయగా అతనికి బంధువుల ఆచూకీ లభించలేదని సమాచారం. గతంలో మేడవరపు రాజు నిజామాబాదులో పలు వివాదాల్లో తలదూర్చి నిజామాబాద్ నుంచి మకాం మార్చాడని తెలిసింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.