రాజధానికి మకాం మార్చిన బెట్టింగ్ నిర్వాహకులు
. . . పోలీసుల నుంచి తప్పించుకోడానికి
. . . పేరున్న లాడ్జీలనుంచే నిర్వాహణ
. . . అనుచరుల సహకారంతో కొనసాగుతున్న క్రికెట్ బెట్టింగ్
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి : జిల్లాలో పోలీసుల వరుస దాడుల నేపథ్యంలో బెంబేలెత్తిపోయిన ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు తమ మకాంను రాజధానికి మార్చుకున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు రాజధానినుండి పేరున్న లాడ్జీలలో మకాం వేసి అక్కడినుంచే సెల్ ఫోన్ వాట్సాప్ ద్వారా బెట్టింగ్ ను నిర్వహిస్తున్నారు. అందుకు తమకు నమ్మకస్తులైన స్థానిక యువకులను నియమించుకుని ఈ తతంగం నడిపిస్తున్నారు. దీంతో పోలీసులు తమ నైపుణ్యం అంతా ప్రదర్శించిన వారిని పట్టుకోలేకపోతున్నారు. మారిన సాంకేతిక పరిజ్నానం ద్వారా ఎంతటి కరుడుగట్టిన నేరస్తుల గుట్టు రట్టుచేస్తున్నాపోలీసులకు ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వాహకులను పట్టుకోవడంలో విఫలమవుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు ఇతరులపేరుతో కొత్తకొత్త సిమ్ కార్డులను తీసుకుని వాటి ద్వారా ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. జిల్లాకు చెందిన కొందరు అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకోవడమేగాకుండా బెట్టింగ్ పై ఆసక్తి ఉన్న వారిని తమ ఉచ్చులో పడేస్తున్నారు. వారి వద్దనుంచి ప్రతి రోజు లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఐపిఎల్ మ్యాచ్ లు ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటివరకు ప్రతి మ్యాచ్ ల పై వివిధ రకాల పందాలపై డబ్బులను పెట్టేవిధంగా వారిని ఉసిగొల్పుతున్నారు. దీంతో వారి ఉచ్చులో పడ్డ యువత బెట్టింగ్ పై డబ్బలు పెట్టడానికి నానావిధాలుగా తంటాలు పడుతూ అప్పలు చేస్తూ వీరి మోసాలకు బలువుతున్నారు. ఇటీవల పొలీసు కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సాయి చైతన్య తనదైన శైలిలో కింది స్థాయి సిబ్బంది సహాకారంతో జిల్లాలో బెట్టింగ్ నిర్వాహకులను గుర్తించి దాడులను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కొందరు ప్రధాన బెట్టింగ్ సూత్రధారులు తమ అడ్డాలను మార్చుకున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు కొత్త మార్గాలను ఎంచుకుని తమ బెట్టింగ్ దందాను కొనసాగిస్తున్నారు. పోలీసులు సైతం పట్టుకోలేని విధంగా రోజుకు వేలల్లో అద్దె వసూలు చేసే లాడ్జీలను ఎంచుకుని జల్సాలు చేసుకుంటున్నారు. వీరిలో జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ ద్వారా సంపాదించిన డబ్బుతో జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలివద్ద పాల కేంద్రాన్ని ప్రారంభించి పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నాడు. గతంలోనూ పోలీసులకు పట్టుబడిన కొందరు బెట్టింగ్ నిర్వాహకులపై కేసులు నమోదైనా తమ పలుకుబడితో పొలీసుల నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
. . . ప్లే ఆఫ్ పోటీలపై పెరిగిన ఆసక్తి … బెట్టింగ్ రాయుళ్లకు పండగే …
ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ లు ప్రారంభమై ఉత్కంఠగాసాగుతుండగా యువతలో ఉన్న క్రేజీని సొమ్ము చేసుకునేందుకు బెట్టింగ్ రాయుళ్లు తమ ముఠాలతో కొత్త పంథాలు ఎంచుకుంటూ భారీఎత్తున బెట్టింగ్ నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. ఐపిఎల్ పోటీలు ప్లే ఆఫ్ కు చేరుతుండడంతో వీరు మరింత ఉత్సాహంతో తమ బెట్టింగ్ కార్యకలాపాలను ముందుకు సాగిస్తున్నారు. యువత ఆసక్తిని సొమ్ము చేసుకునేందుకు ఏజెంట్లను నియమించుకుంటూ భారీ ఎత్తున బెట్టింగ్ కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరు ప్రముఖ పట్టణాలతోపాటు చిన్న స్థాయి పట్టణాలలోనూ తమ పాగా వేసుకుంటూ బెట్టింగ్ కార్యకలాపాలను కొనసాగించేందుకు సిద్దమవుతున్నారు. నిజామాబాద్ జిల్లా సరిహద్దులోనే ఉన్న మహారాష్ట్రలోని ధర్మాబాద్ లోనూ బెట్టింగ్ ఏజెంట్లను నియమించుకుంటూ బెట్టింగ్ కార్యక్రమాలను గట్టుచప్పడుగాకుండా కొనసాగిస్తున్నట్లు సమాచారం.