ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
పటౌడీ ట్రోఫీకి మంగళం
పటౌడీ ట్రోఫీ విషయంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్వదేశంలో భారత జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌లో విజేతలకు బహుకరించే పటౌడీ ట్రోఫీని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విరమించే ఆలోచన చేస్తోంది.అయితే ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డులు తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రత్యేక కారణం ఏమిటనేది తెలియరాలేదు. ఇరు దేశాలకు చెందిన దిగ్గజ ఆటగాళ్ల పేరుతో మరో ట్రోఫీ ఖరారు చేయాలని ఈసీబీ భావిస్తోంది. జూన్, జూలైలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లో కొత్త పేరుతో ట్రోఫీని అందించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ విషయంపై ఈసీబీ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.భారత మాజీ క్రికెటర్ మన్సూర్ ఆలీఖాన్ పటౌడీ గౌరవార్థం ఇంగ్లండ్ బోర్డు 2007లో పటౌడీ ట్రోఫీని ప్రారంభించింది. అప్పటి నుంచి తమ దేశంలో టీమిండియా టెస్ట్ సిరీస్ ఆడి విజేతగా నిలిస్తే పటౌడీ ట్రోఫీని అందించేది. ఇంగ్లండ్ జట్టు భారత్‌లో ఆడితే బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఆంథోని డి మెల్లో ట్రోఫీ పేరుతో బీసీసీఐ సిరీస్ నిర్వహించేది.ఆంథోని 1987లో మరణించగా, పటౌడీ 2011లో కన్నుమూశారు. వీరిద్దరి పేర్ల బదులుగా ఇరు దేశాలకు చెందిన క్రికెట్ దిగ్గజాల పేర్లతో మరో ట్రోఫీని నిర్వహించాలని ఈసీబీ నిర్ణయించింది. జూన్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలో జరగబోయే ఐదు టెస్ట్ సిరీస్‌లోపు ట్రోఫీ కొత్త పేరు ఏమిటో తెలిసే అవకాశం ఉంది.