భూకబ్జాదారులపై సిపి సిరియస్
ఎవ్వరినీ ఉపేక్సించే ప్రసక్తి లేదు
. . . కబ్జాదారుల గుర్తింపుకు ప్రత్యేక బ్రుందాలు
. . . డైరీ ఫారం ఇండియన్ గ్యాస్ గోదాం వెనక 600 గజాల కబ్జా
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి : సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలో ఉన్న కొందరు ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని కబ్జాచేసి అమాయక పేద ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. శివారు ప్రాంతాల్లో ఎక్కువగా కార్మికులు అంతగా చదువురాని వారు నివాసాలు ఉండడంతో వారి అవసరాన్నిఆసరా చేసుకుని కొందరు భూకబ్జాలకు పాల్పడుతున్నారు. దీంతో శివారు ప్రాంతాలలో ఉన్న అటవీశాఖ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఇటీవల ప్రభుత్వ గురుకుల పాఠశాల సమీపంలో సర్వేనం. 249 స్థలాన్ని కొందరు కబ్జాచేసిన విషయన్ని అధికారులకు తెలిపారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి సొమ్ము చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. భూకబ్జాదారులపై పోలీస్ కమిషనర్ సీరియస్ గా ఉన్నారు. కబ్జాదారులు ఎవ్వరైనా ఉపేక్షించే ప్రసక్తేలేదని, వారి ఆగడాలు, దౌర్జన్యాలను అరికట్టి పేద ప్రజలకు అండగా ఉంటామని ఆలోచనలో ఉన్నట్లు ఆశాఖలో చర్చలు వినిపిస్తున్నాయి. భూకబ్జాదారులను గుర్తించేందుకు ప్రత్యేక భ్రుందాలను ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్ర శివారులో కొందరు భూకబ్జాలకు పాల్పడుతూ అమాయక ప్రజలను మోసాలకు గురిచేస్తున్నట్లు వస్తున్నకథనాలపై సిపి స్పందించారు. శివారులోని భూములను కబ్జాలకు పాల్పడడంతోపాటు భూ వివాదాలు స్రుష్టిస్తూ అమాయక ప్రజలపై వీరు భయభ్రాంతులకుగురిచేస్త్తూ వారిని గుప్పిట్లో పెట్టుకుని తతంగం నడిపిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా కొందరిని అనుచరులుగా చేసుకుని వారితో ఈ భూ కబ్జాల దందా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా తమకు పలువురి ప్రముఖ రాజకీయ నాయకుల అండ ఉందని వారిని నమ్మించి పనులు చక్కదిద్దుకుంటున్నారు. నగర శివారులోని ధర్మపురి హిల్స్, డైరీ ఫారం ప్రాంతంలో ఇండేన్ గ్యాస్ వెనకాల స్విమ్మింగ్ పూల్ సమీపంలో ప్రభుత్వ భూములపై కన్నేశారు. ఈ క్రమంలో కొందరు అక్రమార్కులు డైరీ ఫారం సమీపంలో సుమారు 600 గజాల స్థలంలో కంచెను ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్థలాన్ని వారు అమాయక ప్రజలకు అంటగట్టి సొమ్ముచేసుకుంటున్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది.