Thursday, April 3, 2025
spot_img

మలయాళంలో రూపొందిన ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’  యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సినిమా 

మలయాళంలో రూపొందిన ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ 

యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సినిమా 

కుంచకో బోబన్ కి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. ఆయన కథానాయకుడిగా నటించిన సినిమానే ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’. జీతూ అష్రాఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఫిబ్రవరి 20వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. 12 కోట్లతో నిర్మించిన ఈ సినిమా అక్కడ 50 కోట్లకి పైగా వసూలు చేసింది. తెలుగులోను ఈ సినిమాను ఈ నెల 14న రిలీజ్ చేశారు. అయితే పబ్లిసిటీ లేకపోవడం వలన పెద్దగా ఎవరికీ తెలియకుండానే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచి ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ: పోలీస్ ఆఫీసర్ హరిశంకర్ (కుంచాకో బోబన్) సస్పెన్షన్ తరువాత డ్యూటీకి హాజరవుతాడు. అప్పుడు అతని దగ్గరికి నకిలీ గోల్డ్ చైన్ కేసు వస్తుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కండక్టర్ గా పనిచేసే చంద్రమోహన్ కూతురుకు సంబంధించిన గోల్డ్ చైన్ అది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ను మొదలుపెట్టిన హరిశంకర్ కి , చంద్రమోహన్ కూతురుపై అనుమానం వస్తుంది. దాంతో ఆ కేసు విషయంలో అతను మరింత డీప్ గా ముందుకు వెళతాడు. ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా హరి శంకర్ ముందుకు మూడు గోల్డ్ చైన్లు వస్తాయి. ఒక చైన్ చంద్రమోహన్ కూతురుకి సంబంధించినదికాగా, మరో రెండుచైన్లు జోసెఫ్ .. థామస్ అనే ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల కూతుళ్లకి సంబంధించినవి. ఆ పోలీస్ ఆఫీసర్స్ మాదిరిగానే చంద్రమోహన్ కూతురు కూడా ఆత్మహత్య చేసుకోవడం హరిశంకర్ కి మరింత అనుమానాన్ని కలిగిస్తుంది. ఆ మూడు ఆత్మహత్యలకు కారణమైన ‘శ్యామ్’ అనే యువకుడే తన కూతురు కూడా సూసైడ్ చేసుకోవడానికి కారణమని అతను భావిస్తాడు. ఆవేశంతో అతను చేసిన విచారణలోనే శ్యామ్ చనిపోతాడు.

శ్యామ్

శ్యామ్ ఎవరు? అతనికీ .. వరుస ఆత్మహత్యలకు ఉన్న లింక్ ఏమిటి? ఆ ఆత్మహత్యలకు .. గోల్డ్ చైన్లకు గల సంబంధం ఏమిటి? శ్యామ్ చనిపోయిన తరువాత సమసి పోతుందన్న సమస్య మరింత పెద్దదవుతుంది. అందుకు కారకులు ఎవరు? చివరికి ఈ సమస్యను హరిశంకర్ ఎలా పరిష్కరిస్తాడు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది.

విశ్లేషణ: ఈ కథ చాలా సాదాసీదాగా ఒక చిన్నపాటి కేసుతో మొదలవుతుంది. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఈ థ్రెడ్ ప్రధానమైన కథతో బలమైన సంబంధాన్ని కలిగి ఉంటుందనే విషయాన్ని ఆడియన్స్ ఎవరూ గెస్ చేయలేరు. అసలు కథ ఏయే మలుపులు తిరుగుతుందో జాగ్రత్తగా గమనించాలి .. లేదంటే పక్కకి వెళ్లిపోతామనే కంగారుతో ఆడియన్స్ కళ్లు దగ్గర పెట్టుకుని చూసే కంటెంట్ ఇది. జరుగుతున్న నేరపూరితమైన సంఘటనలు ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి ఒక కొలిక్కి వస్తాయి. దాంతో అరే .. ఇప్పటి నుంచి కథ డల్ అయిపోతుందేమోనని ఆడియన్స్ అనుకుంటారు. కానీ అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. నేరస్థుల జాడ తెలుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తుంటే, వాళ్లు పోలీసులను ఫాలో అవుతుండటం థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. నేరస్థులు థామస్ దంపతులను .. హాస్పిటల్లో డాక్టర్ ను రౌండప్ చేసే సీన్స్ ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పుకోవాలి.     ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ప్రాణమని చెప్పాలి. కథను ఎత్తుకున్న దగ్గర నుంచి చివరి వరకూ కూడా ప్రేక్షకులు ఎక్కడా జారిపోరు. తరువాత ఏం జరుగుతుందో అనే ఒక ఆతృత చివరి వరకూ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. క్లైమాక్స్ పూర్తయిన తరువాతనే ఆడియన్స్ హమ్మయ్య అనుకునేలా ఈ కథ నడుస్తుంది. ఎక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు గానీ .. సంభాషణలు గాని లేవు. ఈ మధ్య కాలంలో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో వచ్చిన ఇంట్రెస్టింగ్ కంటెంట్ గా ‘ఆఫీసర్’ గురించి చెప్పుకోవచ్చు.

పనితీరు: కథ .. స్క్రీన్ ప్లే ఎక్కువ మార్కులు కొట్టేసే సినిమా ఇది. దర్శకుడు ఆయా సన్నివేశాలు డిజైన్ చేసిన తీరు కొలిచినట్టుగా కరెక్టుగా అనిపిస్తాయి. ఇక ఆర్టిస్టులు నటిస్తున్నట్టుగా అనిపించదు .. పాత్రలు తప్ప వాళ్లు కనిపించరు. రోబీవర్గీస్ రాజ్ ఫొటోగ్రఫీ బాగుంది. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది. చమన్ చాకో ఎడిటింగ్ పెర్ఫెక్ట్ గా అనిపిస్తుంది.

ముగింపు: ఒక్కోసారి ఒక చిన్నకేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ వెళితే, అది అత్యంత ప్రమాదకరమైన నేరస్థుల ఆనవాళ్లను చూపిస్తుంది. ఆ విషయాన్ని ఆసక్తికరంగా నిరూపించిన సినిమా ఇది. ఒక ఇంట్రెస్టింగ్ సినిమాను చూశామని ఫీల్ మాత్రం తప్పకుండా కలుగుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles