ప్రభుత్వ నిబంధనలను పాతర వేస్తున్న విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు.
అడుగడుగున బెల్టు షాపులు.పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు
అక్షర విజేత నల్లబెల్లి
నల్లబెల్లి మండలం వైన్స్ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలకు పాతర వేస్తూ ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు.ప్రైవేట్ మద్యం దుకాణం కావడంతో తాము చెల్లించిన దరఖాస్తు ఫీజులు,లైసెన్స్ రుసుము, నిర్వాహన ఖర్చులు,ఇతరత్రా పార్ట్నర్ల లాభాలు పంచుకొని సొమ్ములు పెంచుకోవాలన్న అత్యాశతో నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు ఇష్ట రాజ్యంగా కొనసాగిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ మద్యం దుకాణం యజమాని అయిన ఒకరికి మూడు మద్యం సీసాలు మాత్రమే విక్రయించవలసి ఉంటుంది. అందుకు విరుద్ధంగా ఎక్కువగా విక్రయిస్తే ఎక్సైజ్ శాఖ నూతన పాలసీ ప్రకారం ఆ షాపు లైసెన్సు రద్దు చేయవలసి ఉంటుంది. వాస్తవానికి మొదటి విడతగా ఎక్సైజ్ శాఖ హెచ్చరికలతో విడిచిపెట్టి రెండవ దఫాకూడా ఇదే తప్పు పునారావృతమైతే సబ్ సీట్ చేసి లైసెన్స్ రద్దు చేయవలసి వస్తుంది.అయితే వైన్స్ కు ఇటువంటి భయం ఏమి లేదని స్థానికులు చెప్పుకుంటున్నారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారమే ధ్యేయంగా పెట్టుకుని 40 నుండి 50 సీసాల వరకు విక్రయిస్తూ ప్రభుత్వానికి సవాలు విసిరుతున్నారు. ఎక్సైజ్ శాఖ అండదండల్లో,ఎక్సైజ్ శాఖ ఆశీస్సు లో తెలియదు గాని నల్లబెల్లిలో వైన్స్ యాజమాన్యం మాత్రం ఇష్టారాజ్యంగా మద్యమిక్రయాలు కొనసాగిస్తుండడంపై ఈ ప్రాంత ప్రజలు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.ఈ వైన్ షాప్ నిర్వాహకం వలనే గతంలో ఎన్నడు లేని విధంగా బెల్టు షాపులు ఇబ్బడి ముబ్బడిగా దర్శనమిస్తున్నాయి.నిబంధనలకు పాతర వేయడంతో ఎవరికి వారే ఇష్టారాజ్యంగా మద్యం కొనుగోలు చేస్తూ తమ తమ గ్రామాలలో దర్జాగా అనాధికార బెల్టు షాపులను నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఎక్సైజ్ శాఖ ఎందుకు మౌనంగా ఉండి పోతుందో..నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందో అర్థం కావటం లేదని ఈ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు.ఇదిలా ఉండగా అధికారులు వైన్స్ యాజమాన్యంతో కుమ్మక్కై నెలవారి కమీషన్లను దండిగా దండుకుంటూ విచ్చలవిడి మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఇక్కడ విస్తృతంగా వినిపిస్తున్నాయి.ఈ ఆరోపణలకు బలం చేకూరే విధంగా ఎక్కడికక్కడ బెల్టు షాపులు దర్శనమిస్తూనే ఉన్నాయి.వైన్ షాపులో ఉండే విధంగా బెల్టు షాపుల్లో కూడా కేసులు కేసులు మద్యం సీసాలు దర్శనమిస్తూనే ఉన్నాయని ఆయా ప్రాంతాల ప్రజలు గగ్గోలు పెడుతూనే ఉన్నారు.అయినప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదని, దాడులు చేపట్టడం లేదని కేసులు నమోదు చేయడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉదయం 10 నుండి 9 గంటల వరకు మాత్రమే విక్రయాలు జరపవలసి ఉంటుంది అయితే యాజమాన్యం మాత్రం ఉదయం 9 గంటల నుండి విక్రయాలు ప్రారంభించి రాత్రి 11 గంటల వరకు కూడా అడ్డదారుల్లో విక్రయాలు జరుగుతున్నట్లు ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ వైన్స్ ఆగడాలపై ప్రత్యేక దృష్టి సారించి,నిఘా ముమ్మరం చేసి చర్యలు తీసుకోవాలని షాప్ లైసెన్స్ రద్దు చేయాలని వైన్ షాప్ యాజమాన్యానికి సహకరిస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు,సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు