తెలంగాణలో నో బెనిఫిట్ షో…
అక్షరవిజేత,హైదరాబాద్,
అల్లు అర్జున్, సుకుమార్కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప 2 . ఈ సినిమా ఎంత విజయాన్ని అయితే సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమా సాధించి పెట్టిన విజయాన్ని అల్లు అర్జున్ అనుభవించలేకపోతున్నారు. దీనికి కారణం ఆయనే అని చెప్పడంలో కూడా సందేహం లేదు. అసలు విషయంలోకి వెళ్తే.. డిసెంబర్ 4వ తేదీన హైదరాబాదులోని సంధ్యా థియేటర్లో పుష్ప2 సినిమా బెనిఫిట్ షో వేశారు. ఈ సినిమా చూడడానికి ఆయన కార్ లో సైలెంట్ గా వచ్చి ఉండి ఉంటే సినిమా సాఫీగా చూసేవారు. అలాగే ఎవరికి ఏ ఇబ్బంది కలిగేది కాదు. కానీ ఆయన ఎప్పుడైతే ర్యాలీ చేసుకుంటూ జనాల్లోకి వచ్చారో అప్పుడే అసలు విధ్వంసం మొదలయ్యింది.ముఖ్యంగా అల్లు అర్జున్ ర్యాలీ నిర్వహిస్తూ రావడంతో అభిమానులు ఆయనను చూడడానికి పెద్ద ఎత్తున ఎగబడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేస్ ఫైల్ అయింది. దీనికి తోడు ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు బ్రెయిన్ డెడ్ అయి హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇంత జరిగినా సరే అల్లు అర్జున్ సహాయం చేస్తానని చెప్పాడు కానీ దీనిపై పూర్తీగా స్పందించకపోవడంతో ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం మానవత్వం కూడా లేదా అంటూ అల్లు అర్జున్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి తోడు అల్లు అర్జున్ ఈ సినిమా ప్రమోషన్స్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియకుండా ప్రసంగించడం అసలు వ్యతిరేకతకు కారణమైంది.ఒకప్పుడు అల్లు అర్జున్ ని దృష్టిలో పెట్టుకొని ఆయన సినిమాకి బెనిఫిట్ షో లు వేయడానికి అనుమతి ఇవ్వడమే కాకుండా టికెట్ ధరలు పెంచుకోవడానికి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చారు. అలాంటి ఆయనను బన్నీ గుర్తించకపోగా పేరు సంబోధించడానికి కూడా వెనకడుగు వేశారంటే ఆయనలో ఆటిట్యూడ్ ఎంతలా పెరిగిపోయిందో గమనించాలి అంటూ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ లు చేస్తున్నారు. ఇకపోతే ఈ విషయాన్ని పట్టించుకోని రేవంత్ రెడ్డి .. ఒక ప్రాణం పోయినా సరే అల్లు అర్జున్ స్పందించకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్నారు అందులో భాగంగానే ఆయన తాజాగా అసెంబ్లీలో మాట్లాడుతూ.. “ఇకపై మేం అధికారంలో ఉన్నంతవరకు సినిమా వాళ్ళ ఆటలు సాగవు. టికెట్ ధరల పెంపు కానీ బెనిఫిట్ షోలు కానీ ఇక ఉండవు. సినిమా వాళ్లు వ్యాపారాలు చేసుకోండి. కానీ ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూస్తే మాత్రం ఊరుకోము” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే అంటూ అటు అభిమానులు, ప్రజలు కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం.
రేవతి కుటుంబానికి ఆర్థిక సాయం..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరణించిన రేవతి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ప్రస్తుతం ఆమె కుమారుడు శ్రీ తేజ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. శ్రీ తేజ చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది.ఇకపోతే ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టులో హాజరు పరచగా.. విచారణ అనంతరం 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే అల్లు అర్జున్ తరఫు న్యాయవాది హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా వ్యక్తిగత పూచీకత్తు, రూ.50 వేల బాండ్ మీద ఈయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ లభించింది. మరోవైపు అల్లు అర్జున్ బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు మళ్లీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. ఇదే గనుక జరిగితే మళ్లీ అల్లు అర్జున్ జైలుకు వెళ్లక తప్పదు అని కామెంట్లు చేస్తున్నారు.