తలుపులు తెరవని వెల్నెస్ సెంటర్లు
– ఇబ్బందుల్లో రోగులు
అక్షరవిజేత,రుద్రవరం :
మండల పరిధిలోని పలు గ్రామాలలో శనివారం వెల్నెస్ సెంటర్లు తలుపులు తెరుచుకోలేదు దీంతో వైద్య సేవల కొరకు వచ్చిన రోగులు ఇబ్బందులు పడక తప్పలేదు. మండలంలోని చిన్నకంబలూరు కోటకొండ గ్రామాలలో రెండవ శనివారం సెలవు అని వెల్నెస్ సెంటర్లో పనిచేస్తున్న ఎంఎల్ హెచ్ పీ లు సెంటర్లకు రాకపోవడంతో సెంటర్లు తలుపులు తెరుచుకోలేదు, దీంతో వైద్యం కొరకు వచ్చే ప్రజలకు వైద్యం అందక ఇబ్బందులు పడ్డారు. గ్రామీణ ప్రాంతాలలోని వెల్నెస్ సెంటర్లలో సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రతిరోజు వెల్నెస్ సెంటర్లకు వచ్చే రోగులకు వైద్యం అందించాల్సి ఉందని రెండవ శనివారం కూడా ఎలాంటి సెలవు లేదని వైద్య అధికారుల అనుమతితో మాత్రమే హాఫ్ డే సెలవు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యాధికారులు తెలుపుతున్నారు. ఇందుకు భిన్నంగా వెల్నెస్ సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న ఎంఎల్ హెచ్పీలు ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తూ శనివారం వెల్నెస్ సెంటర్ల తలుపులు తెరవకపోవడంతో వైద్యం కొరకు గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మండలంలోని అన్ని వెల్నెస్ సెంటర్లకు రెండవ శనివారం ఇదే తంతు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న వెల్నెస్ సెంటర్ల సిబ్బందిపై చర్యలు తీసుకొని ప్రతిరోజు వెల్నెస్ సెంటర్ల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.