Monday, April 7, 2025
spot_img

సినిమా చూపించబోతున్న హైడ్రా

సినిమా చూపించబోతున్న హైడ్రా

అక్షరవిజేత,హైదరాబాద్ :
అక్రమణలపై ఉక్కుపాదం మోపిన హైడ్రా.. కాస్త విరామం ఇచ్చింది. అతి త్వరలో అంతకుమించి అనేలా యాక్షన్ షురూ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా మియాపూర్‌ స్టాలిన్‌నగర్‌లోని సర్వే నంబర్ 100, 101లపై దృష్టి సారించింది. ఈ సర్వే నంబర్లలో దాదాపు 550 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో వంద ఎకరాలకు పైగా భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఇప్పుడా భూములపైనే ఆరాతీస్తోంది హైడ్రా.ఉమ్మడి రాష్ట్రంలో మియాపూర్ భూముల్ని వేలం వేసేందుకు అప్పటి ప్రభుత్వాలు ప్రతిపాదించాయి. అయితే సుప్రీంకోర్టులో కేసులు ఉండటంతో ఏమీ చేయలేకపోయారు. ఈ క్రమంలో అధికారులు చర్యలు తీసుకుంటే బాగానే ఉండేది. కానీ అంతులేని నిర్లక్ష్యం వహించడంతో కబ్జాకోరులు పేట్రేగిపోయారు. పక్కా సర్వే నంబర్లు, బై నంబర్లతో పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి.ఇక మియాపూర్ భూములు తమకు ఇవ్వాలంటూ వేలాది మంది మహిళలు ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడం అప్పట్లో హెచ్‌ఎండీఏను ఉలిక్కిపడేలా చేసింది. మొదట్లో గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నించారు వాళ్లంతా. ఆ తర్వాత గుడి నిర్మాణానికి సిద్ధమయ్యారు. వారిని సముదాయించేందుకు పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. 144 సెక్షన్ విధించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో చివరకు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది
పేదల దండయాత్రతో హెచ్‌ఎండీఏ అధికారుల్లో కదలిక వచ్చింది. ముందుగా భూముల లెక్క తీశారు. రికార్డుల్లో 105 ఎకరాలు మాయమై.. 445 ఎకరాలు ఉన్నట్టు గుర్తించారు. ఉన్న భూమిలో రెండు కోట్ల 65లక్షల రూపాయలతో ఫెన్సింగ్ వేయాలని టెండర్లు పిలిచారు. కానీ ఆ పనులు కూడా పట్టాలెక్కలేదు. చూస్తుండగానే వందెకరాలకు పైగా సర్కారు భూమి.. అక్రమార్కుల పాలయింది. ఎకరాకి కనీసం 30కోట్ల వరకు ఉంటుందని అంచనా. అంటే హెచ్‌ఎండీఏ అధికారుల నిర్లక్ష్యంతో 3వేల కోట్లకు పైగా విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. లేటెస్ట్‌గా ఈ కబ్జాకాండపై గురిపెట్టింది హైడ్రా. ప్రభుత్వ భూమి ఎంత.. కబ్జాకి గురైందన్న వివరాలు సేకరిస్తోంది.సర్వే నంబర్‌ 100, 101లో ఉన్న భూమి ఎంత? ఎన్ని ఎకరాల్లో నిర్మాణాలు వెలిశాయి? నిర్మాణాలు చేపట్టిన వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసిందెవరు? ఏయే స్థాయి అధికారులు సహకరించారన్న కోణంలో హైడ్రా ఆరాతీస్తోంది. కూల్చివేతల మొదలయ్యాక ఎవరైనా కోర్టుకెళ్లినా.. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చాలా పకడ్బందీగా వ్యవహరిస్తోంది హైడ్రా. ఈ సారి కూల్చివేతలు మొదలెడితే.. ఎవరొడ్డొచ్చినా ఆగేదేలే అన్నట్టుగా ముందుకెళ్లాలని భావిస్తోంది హైడ్రా..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles