వడదెబ్బతో ఇద్దరి మృతి
— జిల్లాలో ఎండల ఎఫెక్ట్


అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి : నిజామాబాద్ జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. వారం రోజుల్లో నిజామాబాద్ జిల్లాలో ఎండలు 43 డిగ్రీలకు చేరుకుంది. నిజామాబాద్ జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా ప్రాంతానికి చెందిన మొహమ్మద్ అహ్మద్ షరీఫ్ అనే యువకుడు గురువారం ఎండ దెబ్బతో చనిపోయాడు. 30 ఏళ్ల యువకుడు ఎండ దెబ్బతో చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇందల్వాయి మండలం డొంకల్ తాండకు చెందిన రమావత్ అఖిల్ (5) గురువారం ఉదయం తండాలోని స్కూల్ కి వెళ్ళాడు అక్కడ బాలుడికి వాంతులు విరేచనాలు కావడంతో అతడిని నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బాలుడు చనిపోయినట్టు నిర్ధారించారు. బాలుడి మృతికి వడదెబ్బని కారణమని వైద్యులు ధృవీకరించారు. జిల్లాలో ఒక్క రోజే ఇద్దరు వడదెబ్బతో మృతి చెందడం ఎండల తీవ్రతను చెప్పకనే చెబుతోంది. ఎల్ నీవో ప్రభావంతో తెలంగాణ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచి కోడుతుండగా జిల్లాలో ఆ ప్రభావం ప్రజలపై అధికంగా పడుతుంది. ప్రజలు ఎవ్వరు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ తెలియజేసింది.