ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
*వేసవి కాలంలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్
అక్షర విజేత గద్వాల బ్యూరో:
ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నందున, తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం నుండి ఎండ దెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఎండల్లో బయట తిరగకుండా జాగ్రత్త వహించాలని, అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రజలు బయటికి రాకూడదని, మద్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మద్యలో ఎట్టి పరిస్థితులలో ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు తెలిపారు. ఎండాకాలంలో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు వంట నివారించాలని, ఎండలలో పనిచేయవద్దని ఆల్కహాల్ ,టీ, కాఫీ, స్వీట్స్ చల్లని డ్రింక్స్ తీసుకోవద్దని , చెప్పులు లేకుండా బయట నడవవద్దని అన్నారు. అలాగే చిన్నారులు, వయోవృద్దులు ఇంటికే పరిమితం కావాలని, ప్రతి రోజు సరిపడ నీరు తీసుకోవాలని, వదులుగా ఉన్న దుస్తువులను ధరించాలని, బయటికి వెళ్ళేటప్పడు గొడుగు లేదా టోపిని దరించాలని,
ద్విచక్రవాహానాల పై సుదూర ప్రయాణాలు చేయకూడదని, సూర్యుని కిరణాలు శరీరంపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అలాగే ఎండలో పనిచేసే కార్మికులు తరచుగా నీటీతో పాటు ఓ.ఆర్.ఎస్. ద్రావణాన్ని తీసుకోవాలని తద్వారా వడదెబ్బ నుండి శరీరాన్ని కాపాడు కోవచ్చన్నారు. చర్మం పై ఎర్రటి దద్దుర్లు, చర్మం పొడిబారడం లాంటివి చర్మం పై వస్తున్న మార్పులను గమనించాలని, అధిక శరీర ఉష్ణోగ్రత, అలసట, నోరు ఎండి పోవడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే సమీప ప్రభుత్వ ఆసుపత్రులలో సంప్రదించి చికిత్స, అవసరమైన మందులు పొందాలని అన్నారు. ఓ.ఆర్. యస్. ప్యాకెట్లు, ఫ్లూయిడ్స్ అవసరమైన అన్ని రకాల మందులు ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని ఈ వేసవి కాలంలో జాగ్రత్తలు పాటిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ కోరారు.