పోలింగ్ విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి

అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి మే 13 న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లచే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫెలిసిటేషన్ సెంటర్లు, పీ.ఓలు, ఏ.పీ.ఓలకు అందిస్తున్న హ్యాండ్ బుక్, శిక్షణ ఇస్తున్న తీరును పరిశీలించారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ విధులు నిర్వర్తించిన సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి పలువురి నుండి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీ.ఓలు, ఏ.పీ.ఓ లను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. శిక్షణ తరగతులను చక్కగా ఆకళింపు చేసుకుని ఎన్నికల విధులకు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహనను ఏర్పర్చుకోవాలని, ఇదివరకు ఎన్నికల విధులు నిర్వర్తించిన వారు సైతం ట్రైనింగ్ క్లాసులను తేలికగా తీసుకోకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల గురించి తెలుసుకోవాలని సూచించారు. పోలింగ్ డే సందర్భంగా పి.ఓ లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి క్లుప్తంగా వివరించారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన నియమావళి ప్రకారంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కాగా విధులు నిర్వహించాలన్నారు. కొందరు పి.ఓ లు శిక్షణ కు రాకుండా అంతా తమకు తెలిసిందేనని అతి విశ్వాసంతో తప్పులు చేస్తారని అన్నారు. డిస్ట్రిబ్యూషన్ రోజు ఈ.వి.ఎం లు తీసుకొని పోలింగ్ డే పూర్తయిన తర్వాత సాయంత్రం కాగానే తిరిగి ఇవ్వవలసిన బాధ్యత పి.ఓ లేదన్నారు. పొలిటికల్ ఏజెంట్ మిమ్ములను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. దానికి సమాధానం చెప్పాల్సింది పి.ఓ అధికారి దే పూర్తి బాధ్యత. పోలింగ్ డే రోజు మీరే బాస్ ఎవ్వరికీ బాధ్యత ఉండదని, పోల్ తర్వాత రిపోర్ట్ తయారు చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్ తదితరులు ఉన్నారు.