వడ్డెరులకు కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని వినతి
అక్షర విజేత, మంచిర్యాల ప్రతినిధి:
తెలంగాణ వడ్డెర సంఘం, చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వడ్డెర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడు మంజల మల్లేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో వడ్డెర కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించి ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వడ్డెర కులాన్ని మర్చిపోవడంపై అసంతృప్తి చెందిన వడ్డెర కులస్తులంతా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యే మంత్రులకు వినతి పత్రాలు అందిస్తున్నామని అన్నారు. పార్టీలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు కాని వడ్డెర్ల జీవితాలు మాత్రం మారడం లేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చుతామని బహిరంగ సభలో ప్రకటించారు. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ కి వడ్డెర కులాన్ని ఎస్టిలో చేర్చాలని వడ్డెర సంఘం నాయకులు పలు సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అనేక మార్లు కలెక్టర్ ఆఫీసులు అసెంబ్లీ ముట్టడి చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింధి. కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో వడ్డెర కులానికి వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి సరిపడా నిధులు కేటాయిస్తామని, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుమార్లు రాహుల్ గాంధీ వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామని బహిరంగ సభలో ప్రకటించారు. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వడ్డెర్లను ఎస్టి జాబితాలో చేర్చాలని అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వడ్డెర జీవితాలు మారుతాయని కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెరులు అండగా ఉండి ఓట్లు వేసి గెలిపించామని, ఏదేమైనప్పటికీ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. లేనియెడల రానున్న పార్లమెంట్ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా వడ్డెర కులాస్తులంతా నామినేషన్ వేయడానికి సిద్ధమవుతామని వెల్లడించారు. కార్యక్రమంలో తాండూర్ మండల అధ్యక్షులు
రేపాక రమేష్, కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.