ఓటు హక్కు వినియోగించుకొని అభివృద్ధి చేసే నాయకత్వాన్ని ఎన్నుకోవాలి
జిల్లా ఎన్నికల అధికారి
జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్
అక్షర విజేత ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో..
లోక్సభ ఎన్నికలలో పోలింగ్ రోజున అర్హత గల ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేసే సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐ.బి. చౌరస్తా నుండి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం వరకు చేపట్టిన 5కె రన్ ర్యాలీని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాహుల్, డి.సి.పి. అశోక్కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి పౌరుడికి సమాన విలువ కలిగిన ఓటు హక్కును రాజ్యాంగం మనకు కల్పించిందని, ఎన్నికలలో వయస్సు అర్హత, ఓటరు జాబితాలో పేరు గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని, తద్వారా ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధికి పాటు పడే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని అన్నారు. ఎన్నికలలో పోలింగ్ శాతం తక్కువగా నమోదయ్యే ప్రాంతాలను గుర్తించి పోలింగ్ శాతాన్ని పెంపొందించే విధంగా కళాజాత, ఇంటింటి తిరుగుతూ, వివిధ రకాల విస్తృత ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపర్చడం జరుగుతుందని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు వారి పరిధిలో సిబ్బందితో కలిసి అర్హత గల ప్రతి ఒక్కరు ఓటు వేసేలా ప్రోత్సహించాలని, ఓటు హక్కు కలిగిన వారు తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడంతో పాటు అర్హత గల వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరు ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యపరచాలని తెలిపారు, లోక్సభ ఎన్నికలు-2024లో భాగంగా మే 13వ తేదీన జరుగనున్న పోలింగ్లో వయస్సు అర్హత ఉండి ఓటరు జాబితాలో పేరు గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎన్నికల నేపథ్యంలో స్వీప్లో భాగంగా వాక్ టు పోలింగ్ బూత్, ఓటు వినియోగం, ప్రాముఖ్యత తెలియజేసేందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 1, 2024 తేదీని ప్రామాణికంగా తీసుకొని 18 సం||లు వయస్సు నిండే ప్రతి ఒక్కరు ఏప్రిల్ 15వ తేదీ లోగా తమ వివరాలు నమోదు చేసుకొని నూతన ఓటరు కార్డు పొందాలని తెలిపారు. జిల్లాలో దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్లను ఓటు వేసేలా ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికలలో ఎలాంటి కుల, మత, వర్గ, ప్రాంతాల వివక్ష లేకుండా, ప్రలోభాలకు గురి కాకుండా పోలింగ్ రోజున నిస్పక్షపాతంగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే టోల్ ఫ్రీ నం.1950, సి-విజిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అందరితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక సారధి కళాకారులు ఆలపించిన గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు, జిల్లా అధికారులు, యువతీ, యువకులు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, బూత్ స్థాయి అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.