
అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి : యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యం సేకరించేందుకు ప్రభుత్వపరంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో, పొరుగు రాష్ట్రాల నుండి ధాన్యం నిల్వలు రాకుండా గట్టి నిఘా ఉంచుతామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి మంగళవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం సేకరణ కోసం జిల్లాలో చేపడుతున్న చర్యల గురించి సీ.ఎస్ దృష్టికి తెచ్చారు. ప్రస్తుత రబీ సీజన్ కు సంబంధించి 06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. గతేడాది జిల్లాలో 460 కేంద్రాలు కొనసాగగా, ప్రస్తుతం 466 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సన్నాహక సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల రైతులందరికీ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండేలా ఆయా ప్రదేశాలను గుర్తించడం జరిగిందన్నారు. ఎలాంటి ఒడిదుడుకులకు తావులేకుండా కేంద్రాలు సాఫీగా కొనసాగేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతోనూ సమావేశమై స్పష్టమైన సూచనలు చేశామని, రైతుల నుండి సేకరించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుండి ఎలాంటి జాప్యం లేకుండా వెంటదివెంట రైస్ మిల్లులకు చేరవేసేలా చొరవ చూపాల్సిందిగా సూచించామని సీ.ఎస్ దృష్టికి తెచ్చారు. ధాన్యం నిల్వ చేసేందుకు కోటీ 30 లక్షల గన్నీ బస్తాలు అవసరం ఉండగా, జిల్లాలో కోటీ 11 లక్షల గన్నీ బస్తాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం నిల్వలు రాకుండా గట్టి నిఘా కొనసాగిస్తామని అన్నారు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన సందర్భంగా జిల్లాలో నాలుగు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ఈ చెక్ పోస్ట్ ల ద్వారా కూడా పొరుగు రాష్ట్రాల నుండి ధాన్యం జిల్లాలో ప్రవేశించకుండా కట్టడి చేస్తామని అన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాలు, ఫ్లెక్సీలు, పోస్టర్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తు.చ తప్పకుండా నిబంధనలు అమలయ్యేలా చర్యలు చేపట్టామని సీ.ఎస్ కు తెలిపారు.
కాగా, వీ.సీ ముగిసిన అనంతరం కలెక్టర్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయమై సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. ఏప్రిల్ మొదటి వారంలోపు జిల్లాలోని అన్ని నిర్దేశిత ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 10 లోపు అన్ని సెంటర్స్ రైతులకు అందుబాటులోకి రావాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా, నిర్లక్ష్యానికి తావివ్వకుండా రైతాంగ ప్రయోజనాలే కర్తవ్యంగా కొనుగోలు కేంద్రాలను నెలకొల్పాలని హితవు పలికారు. కేంద్రాల్లో తాగు నీరు, నీడ కోసం షామియానాలు వంటి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలతో పాటు, టార్పాలిన్లు, తేమ కొలిచే యంత్రాలు, తూకం యంత్రాలు వంటి వాటిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులు నాణ్యత ప్రమాణాలకు లోబడి బాగా ఆరబెట్టిన, శుభ్రపర్చిన ధాన్యం నిల్వలను కేంద్రాలకు తెచ్చి, ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయిలో మద్దతు ధర పొందేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను రోజువారీగా పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు తన దృష్టికి తేవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కిరణ్మయి, డీఎస్ఓ చంద్రప్రకాశ్, సివిల్ సప్లయిస్ డీ.ఎం జగదీశ్, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, జిల్లా మార్కెటింగ్ అధికారిణి గంగూబాయి, సహకార శాఖ అధికారి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.