చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
-జిల్లాలోని రౌడీషీటర్స్ కి కౌన్సిలింగ్
-రౌడీ షీట్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేకంగా నిఘా
-మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తాం
-రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్
అక్షర విజేత,మంచిర్యాల ప్రతినిధి:
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో మంచిర్యాల జిల్లాలోని రౌడీషీటర్లలో మార్పు కోసం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ కౌన్సిలింగ్ సదస్సు నిర్వహించారు. నేర చరిత్ర, ప్రస్తుత జీవన విధానం, ఉద్యోగ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీపీ మాట్లాడుతూ గతంలో నేరాలకు పాల్పడిన వారు నేర ప్రవృత్తిని వీడి సమాజంలో మంచి నడవడికతో కొనసాగాలని, హుందాగా జీవించాలని సూచించారు. నేరస్తుల తొందరపాటులో నేరాలు చేసినా వారి కుటుంబ సభ్యులు సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కావున “నేరస్థులు ఎవరూ చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యం” చట్టం ముందు అందరూ సమానులే అని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఏ నేరం చేసినా పోలీసులు గుర్తిస్తారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. నేరం చేసే ముందు మీ కుటుంబాలు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి అని సీపీ అన్నారు. నేరాల నియంత్రణలో మీరు భాగస్వామ్యూ లు కావాలి అన్నారు. రౌడీ షీటర్ ఉన్న ప్రతీ ఒక్కరిపై ప్రత్యేక బృందాల ద్వారా ప్రత్యేక నిఘా ఉంటుందని, చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భూ కబ్జాలు, ప్రజలను భయపెట్టడం, ఆస్తుల ధ్వంసం వంటి చట్ట విరుద్ధ పనులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. నేరప్రవృత్తిని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నామని, ఒకవేళ మారకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. గత పది సంవత్సరాల నుండి ఎలాంటి నేరాలకు పాల్పడకుండా మంచి సత్ప్రవర్తన కలిగి ఉండి పూర్తిగా మారితే రౌడీ షీట్ తొలగించేందుకు కూడా అవకాశం ఉందని సీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి అశోక్ కుమార్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్, మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.