ఆగ్రో రైతు సేవ కేంద్రం లో తీసుకున్న మందులు నకిలీవి కావు
– ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ
– వివరాలు వెల్లడించిన వ్యవసాయ శాఖ ఏడిఏ మరియు ఏవో
అక్షరవిజేత ,కొండపాక:
కొండపాక మండలం దుద్దెడకు చెందిన చిలుముల శ్రీనివాస్ అనే రైతు వెలికట్ట శివారులోని పురుగుల మందు దుకాణంలో తెచ్చిన మందులు నకిలీవి కావని పరీక్షల్లో నిర్ధారణ అయినట్టు వ్యవసాయ శాఖ గజ్వేల్ డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి బాబు నాయక్ వెల్లడించారు. గురువారం ఐఓసీ కార్యాలయంలో మండల వ్యవసాయ శాఖ అధికారిని ప్రియదర్శినితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించారు. పురుగుల మందు దుకాణంలో రైతు ఈ నెల 10న నకిలీ మందులు తీసుకపోవడం వల్లనే వరిచేను నష్టపోయిందని ఆందోళనకు దిగాడు. దాంతో వ్యవసాయ శాఖ అధికారులు కంపెనీ శాస్త్రవేత్తలు వ్యవసాయ క్షేత్రంలోని నష్టపోయిన వరి ఆకులను వరి పంటకు వాడిన మందులను టెస్టింగ్ కోసం రాజేంద్రనగర్ లోని ల్యాబ్ కు పంపించారు.ల్యాబ్ పరీక్షల్లో తెగుల్ల కోసం తీసుకెళ్లిన మందులు సరైనవేనని మందులతోపాటు గడ్డి మందు కలపడంతో చేను దెబ్బతిన్నట్టుగా పరీక్షల్లో తేలిందని పేర్కొన్నాడు. పంటలకు తెగులు సోకినప్పుడు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి మందులు తీసుకెళ్లాలని అలాగే రసీదులు తీసుకోవాలని తెలిపాడు.