ఎస్.ఎస్.టి, ఎఫ్.ఎస్ టీమ్స్ విస్తృత తనిఖీలు
— జిల్లా కలెక్టర్
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి
పార్లమెంట్ ఎన్నికల-2024 నియమావళి అమలులోకి వచ్చిన సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పోలీస్, ఎస్.ఎస్.టి, ఎఫ్.ఎస్ టీమ్స్ విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇట్టి తనిఖీలలో రూ. 50,000 కంటే ఎక్కువ నగదు కానీ, బంగారం, వెండి కానీ ఉండి సరైన ఆధారాలు చూపకుంటే, తనిఖీ అధికారులు అట్టి డబ్బులను, వస్తువులను జప్తు చేయడం జరుగుతుందని అన్నారు. తనిఖీల్లో జప్తు చేసిన నగదు, బంగారం, వెండి, వస్తువులు రూ.10 లక్షలకు లోబడి ఉండి, తగిన ఆధారాలు చూపిన పక్షంలో వాటిని విడుదల చేయడానికి జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ గ్రీవెన్స్ కమిటీ (డీ.జీ.సీ)ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కమిటీకి అదనపు కలెక్టరు(రెవెన్యూ) చైర్మన్ గా వ్యవహరిస్తారని, సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్, జిల్లా కోశాధికారి జిల్లా గ్రీవెన్స్ కమిటీ పని చేస్తుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వివరించారు. రూ. పది లక్షల లోపు నగదు లేదా బంగారం, వెండి వస్తువులకు సంబంధించిన ఆధారాలను జిల్లా గ్రీవెన్స్ కమిటీ పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉన్న వాటిని విడుదల చేస్తుందన్నారు. ఒకవేళ జప్తు చేయబడిన నగదు/బంగారం, వెండి ఇతర వస్తువుల విలువ రూ. 10,00,000 (రూపాయలు పది లక్షలకు) మించి ఉంటే ఈ కమిటీ అట్టి వివరాలను పరిశీలన కోసం ఆదాయపు పన్ను విభాగం నోడల్ అధికారికి పంపుతుందని తెలిపారు. వారి పరిశీలన రిమార్కుల ప్రకారం తనిఖీల్లో రూ. పది లక్షలకు మించి పట్టుబడిన నగదు, బంగారు/వెండిని విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. కాగా, జిల్లాలో నేటి వరకు మూడు కేసులు నమోదు చేయనైనదని తెలిపారు. ఇందులో ఒక కేసు రూ.50000 లను తగిన ఆధారాలు చూపించినందున, డీజీసీ కమిటీ ఆ మొత్తాన్ని విడుదల చేసిందన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎవరు కూడా రూ.50,000 నగదు కంటే ఎక్కువ డబ్బులు కానీ బంగారం, వెండి వస్తువులతో ప్రయాణించకూడదని సూచించారు. ఒకవేళ తెలియక ప్రయాణించిన తనిఖీలలో మీ డబ్బులు కానీ బంగారం, వెండి వస్తువులు కానీ జప్తు చేయబడితే, ఆందోళన చెందకుండా సంబంధిత దృవపత్రాలతో జిల్లా గ్రీవెన్స్ కమిటీనీ (కలెక్టర్ కార్యాలయం) నందు నోడల్ అధికారి పల్లె పాపయ్య, డిప్యూటీ రిజిస్ట్రార్, కోఆపరేటివ్, నిజామాబాద్ (సెల్ నెం. 7997590472) ను సంప్రదించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.