బాబోయ్ ఎండలు శీతల పానీయాల వైపు పరుగులు
అక్షర విజేత, నిజామాబాద్ సిటీ
జిల్లాతో పాటు నగరంలో ఎండలు మండుతున్నాయి. భానుడు ఉదయం నుంచే ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి చివరిలో ఎండలు 38 నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఏప్రిల్, మే నెలలో ఏవిధంగా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండా బారి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాల వైపు పరుగులు తీస్తున్నారు. జిల్లాతో పాటు నగరంలోని చాలా చోట్ల పండ్ల రసాల, కొబ్బరి బొండాల దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఈ పానీయాల ధరలు చుక్కలనంటుతున్నాయి. తప్పని పరిస్థితుల్లో ప్రజలు సేవించక తప్పడం లేదు. ఒక్కో కొబ్బరి బొండా ధర రూ.50 నుంచి రూ.60 పలుకుతోంది. మిగతా పానీయాలు రూ.20 నుంచి మొదలు పెడితే రూ.100కు విక్రయిస్తున్నారు. వీరిని అడిగే నాథుడే లేకపోవడంతో పండ్ల దుకాణాల నిర్వాహకులు నాచురల్ పండ్లతో కాకుండా రసాయనాలు, కెమికల్, లిక్విడ్స్, పౌడర్లు కలిపి రంగు రంగుల పండ్ల రసాలు తయారీ చేసి సొమ్ముచేసుకుంటున్నారు. వీటిని తాగిన ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో ఉపశమనం కోసం కొబ్బరిబొండాలు తప్ప ఇతర పానీయాలు సేవించొద్దని నిపుణులు పదేపదే చెబుతున్నారు. వీటిని తాగుదామంటే ధరలు అందనంత దూరంలో ఉంటున్నాయి. తక్కు ధరలతో నోటికి రుచిగా ఉంటే రసాయనాలతో కూడిన పండ్ల రసాలు తాగడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.