బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి
-నిబంధనలకు విరుద్ధంగా యూ టర్న్ ఏర్పాటు
-బాధ్యులైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
-లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు
అక్షర విజేత, మంచిర్యాల ప్రతినిధి:
బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ సమీపాన జాతీయ రహదారి 363 పై గల యూటర్న్ కారణంగా ప్రాణాలు కోల్పోయి, గాయాలపాలైన బాధితులకు నష్టపరిహారం చెల్లించి ప్రమాదాలకు కారణమైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు చిలుక రాజనర్సు మాట్లాడుతూ నేషనల్ హైవే నిబంధనలకు విరుద్ధంగా అవసరం లేని చోట యూటర్న్ ఏర్పాటు వలన చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని దీని వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని అన్నారు. మరికొందరు గాయాలపాలై వికలాంగులు అవుతున్నారని ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలలో ఏడుగురు మృతి చెందారని, వారి పిల్లలు సమాజంలో అనాధలుగా మారిపోతున్నారని అన్నారు కొందరు. కొందరు రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడున్న వారి వెంచర్ల వ్యాపారం కోసం నేషనల్ హైవే అధికారులపై, రాజకీయ ఒత్తిడి తీసుకువచ్చి నిబంధనలకు విరుద్ధంగా గ్రామ సమీపాన పెట్రోల్ బంక్ ఏర్పాటు అదేవిధంగా తిరుమల హిల్స్ వద్ద నేషనల్ హైవేకు మధ్యలో ఉన్న డివైడర్ ను తొలగించి నేషనల్ హైవే నిబంధనలకు విరుద్ధంగా యూటర్న్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనివలన ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని పేర్కొన్నారు. నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన వారికి కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం, గాయపడిన వారికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నామన్నారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా యూటర్న్ ఏర్పాటుకు బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకొని విధుల నుండి తొలగించి, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మాసం మురళి,గంధం రమేష్,ఎనగందుల శివాజీ,కాసర్ల రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.