* వేసవిలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
* జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి
అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి
వేసవిలో మంచి నీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలో మున్సిపల్, గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు బోరేవెల్స్, చేతిపంపులను మరమ్మతులు చేపట్టే దిశగా మిషన్ భగీరథ అధికారులు, మున్సిపల్ కమిషనర్ లతో గురువారం కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బోర్ వెల్స్, చేతి పంపులు పనిచేయనట్లయితే ఏప్రిల్ 5వ తేదీలోపు మరమ్మత్తుల పనులు పూర్తి చేసి వినియోగంలోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు త్రాగునీరు అందించడంలో అలసత్వం వహించిన, నిర్దేశించిన గడువులోపు మరమ్మతులు చేపట్టని అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. మిషన్ భగీరథ నీరు అనివార్య కారణాలవల్ల నిలిచిపోయినట్లయితే ప్రత్యామ్నాయంగా త్రాగు నీటిని అందించేందుకు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. మిషన్ భగీరథ, పంచాయత్ రాజ్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహిస్తూ మంచినీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలు ఉన్న గ్రామాలను గుర్తించి సత్వరమే పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే మంజూరైన పనులన్నింటినీ పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని పేర్కొన్నారు.
ఈ టెలికాన్ఫరెన్స్ లో జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు బాబు శ్రీనివాసు, నాగేశ్వరరావు, మిషన్ భగీరథ ఏఈలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.