- కాంగ్రెస్, బీజేపీలతో చెలిమి
- బీఆర్ఎస్ కార్యక్రమాల్లో హాజరు
- తాజాగా ఆస్ట్రేలియాలో కమళదళంతో..
- మూడేళ్లుగా అదే వ్యూహం
- అంతుపట్టని అంతరంగం
విజేత, తెలంగాణ ఎడిటర్ డా. బి, అనిల్ కుమార్:మల్లారెడ్డి మూడు పార్టీలతో ఆడుకుంటున్నారా? మైండ్ గేమ్ నకు తెరతీశారా? ఆయన బీఆర్ఎస్ లోనే ఉంటారా? లేకుంటే బీజేపీలోకి వెళతారా? కాకపోతే హస్తం గూటికి చేరుతారా? పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే చర్చ. అటు గులాభీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థిస్తుంటారు. మరోవైపు బీజేపీ అగ్రనేతలను కలుస్తుంటారు. పొరుగున కర్నాటక వెళ్లి కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతుంటారు. ఇలా తెలంగాణ రాజకీయాల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తుంటారు. కానీ నేరుగా మాత్రం ఏ పార్టీలో చేరడం లేదు. గత రెండున్నరేళ్లుగా ఇదే తంతు. మల్లారెడ్డి అంతరంగం ఏంటో అంతుపట్టడం లేదు.
*ప్రతిసారి ఇదే ప్రచారం..*
2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు ఆయన కాంగ్రెస్ లేదా బీజేపీ పార్టీల్లో చేరడం ఖాయం అన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని ఆయన ఖండిస్తూ వస్తున్నారు. అయితే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన విద్యాసంస్థల ఆక్రమణల మీదకు వచ్చినప్పుడు బెంగళూరులో ప్రస్తుత సీఎం, అప్పటి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిశారని, ఆ తర్వాత మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం, బీజేపీ పార్టీ కార్యాలయానికి వెళ్లడం పార్టీ మార్పుపై చర్చలకు దారితీసింది. అయితే మల్లారెడ్డి యూనివర్సిటీ ఏఐ క్యాంపస్, డిజిటల్ ఇండియా స్కిల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ప్రధాన అతిథిగా ఆహ్వానించడానికే ప్రధానిని కలిసినట్టు కోడలు వివరణ ఇచ్చారు.
*ఆస్ట్రేలియాలో హడావుడి..*
ఇలా ఎప్పటికప్పుడు మల్లారెడ్డి పార్టీ మార్పుపై వార్తలు వస్తునే ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియా బ్రిస్బేన్ లోని ఇండియన్ కల్చరల్ సొసైటీ కన్వెన్షన్ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా వెళ్లిన సందర్భంగా టూవుంబా మేయర్ జియోఫ్ మెక్ డొనాల్డ్ తో కలిసిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, మల్లారెడ్డి, పైడి రాకేష్ రెడ్డిలతో కలిసి ఉన్న ఫోటోలను ఎక్స్ లో షేర్ చేయడంతో పార్టీ మార్పు అంశం మీద మరోసారి చర్చ మొదలైంది. ఆస్ట్రేలియా వెళ్లిన మల్లారెడ్డికి బ్రిస్బేన్ లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా క్వీన్స్ లాండ్ కన్వీనర్ విన్నీ తూముకుంట ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆహ్వానం పలికాయి. అయితే ఆయన ఆ తర్వాత బీజేపీ ముఖ్యులతో సమావేశం కావడమే ఇక్కడ చర్చకు దారితీసింది.
*ఫ్యామిలీ ప్యాకేజీ కోసమేనా..*
మల్లారెడ్డి కుటుంబానికి చాలా కోరికలు ఉన్నాయి. ఫ్యామిలీ ప్యాకేజీ మాదిరిగా టిక్కెట్లు ఇచ్చే పార్టీ వైపు వెళ్లాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్, కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి మేడ్చల్, మల్కాజిగిరి ఎమ్మెల్యే టికెట్లు అడుగుతున్నారని అంటున్నారు. కొన్ని ప్రస్తావనల్లో నాలుగు ఎమ్మెల్యే, ఒక ఎంపీ టికెట్ అడుగుతున్నారని కూడా చెబుతున్నారు. అయితే బీజేపీ మాత్రం ముందు పార్టీలో చేరి పనిచేయండి, ఆ తర్వాత టికెట్ల అంశాన్ని పరిశీలిద్దాం అంటున్నారని సమాచారం. అయితే మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుండి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పోటీ చేసి గెలిచారు. బీఆర్ఎస్ నుండి బహిష్కరించిన అనంతరం ఆయన సొంత పార్టీ పెడతారని అనుకున్నా ఆయన బీజేపీలో చేరడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ పార్టీలో చేరి ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రి అవుతారు, లేదా రాష్ట్ర బీజేపీ అధ్యక్ష్య పదవి ఇస్తారని ప్రచారం జరిగినా అది ఊహాగానాలకే పరిమితం అయింది. మరి మల్లారెడ్డి కోసం బీజేపీ ఏకంగా సిట్టింగ్ ఎంపీ ఈటెలను పక్కనపెట్టి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తారన్నది అనుమానమే. వ్యాపారాలు, విద్యా సంస్థల నేపథ్యంలో మల్లారెడ్డి పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నది నిజమే అని గత పరిణామాలు అన్నీ పరిశీలిస్తే అర్థమవుతోంది. కానీ ఆయన ఒక మంచి అవకాశం కోసం వేచి చూస్తున్నారని తెలుస్తోంది.