Logo
Date of Publish : 30 July 2026, 7:46 pm
Editor : B. Anil Kumar

భారీగా పెరిగిన బియ్యం ధరలు

విజేత,హైదరాబాద్ : తెలంగాణలో బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో ధరల పెరుగుదల మరింత ఎక్కువగా నమోదవుతోంది. ఈ పరిస్థితికి ఎల్‌నినో ప్రభావంతో పంట దిగుబడులపై నెలకొన్న ఆందోళనలు ఒక కారణమైతే,.. ప్రైవేటు వ్యాపారులు భారీగా బియ్యాన్ని నిల్వ చేయడం మరో ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. మే నుంచి జులై మధ్య దేశవ్యాప్తంగా బియ్యం రిటైల్ ధరలు సగటున 3.33 శాతం పెరిగాయి. అదే కాలంలో తెలంగాణలో మాత్రం 4.65 శాతం పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో బియ్యం సగటు రిటైల్ ధర కిలోకు రూ.52.67గా ఉండగా.. ఇది దేశ సగటుతో పోలిస్తే దాదాపు రూ.10 ఎక్కువ. ప్రముఖ రకాల సన్నబియ్యం ధరలు కిలోకు రూ.54 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు.. ఎల్‌నినో ప్రభావంతో పంటపై ఆందోళనలు నెలకొనడంతో ధరలు పెరిగాయని చెప్పారు. రానున్న నెలల్లో పంట బాగా వస్తే ధరలు మళ్లీ తగ్గే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు.అయితే ధరల పెరుగుదలకు ఎల్‌నినో ఒక్కటే కారణం కాదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం బాగానే ఉన్నందున సరఫరాలో పెద్ద అంతరాయం లేదన్నారు. అయినప్పటికీ ధరలు పెరగడానికి ప్రైవేటు వ్యాపారుల నిల్వలు కూడా ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పొందించిన పాలసీ పత్రం ప్రకారం.. భౌగోళిక-రాజకీయ అనిశ్చితులు, ఎరువులు-ఇంధన వ్యయాల పెరుగుదల, ఆసియా దేశాల్లో ఎల్‌నినో ప్రభావం కారణంగా ప్రపంచ మార్కెట్‌లో బియ్యం ధరలు 30 నుంచి 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.పాలసీ పత్రంలో మూడు రకాల పరిస్థితులను ప్రస్తావించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో రానున్న రోజుల్లో బియ్యం ధరలు అకస్మాత్తుగా ఎగబాకే ప్రమాదం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం హెచ్చరించింది. ప్రస్తుతానికి మార్కెట్‌లో ధాన్యపు నిల్వలు తగినంతగా ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో ఏర్పడే వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బియ్యం వ్యాపారాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని తాజా పాలసీ పత్రంలో స్పష్టం చేశారు. సెంటర్ ఫౌండింగ్ డైరెక్టర్ సమరేందు మొహంతి, పీజేటీఏయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఆసియాలోని ప్రధాన వరి సాగు ప్రాంతాలపై ఎల్ నినో ప్రభావం పడితే, దిగుమతి చేసుకునే దేశాలు ముందుగానే నిల్వలు పెంచుకోవడానికి మొగ్గు చూపుతాయి.దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలు యావరేజ్‌గా 30 నుంచి 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అధ్యయనం అంచనా వేసింది. ఉత్పత్తి స్థిరంగా ఉండి, ప్రభుత్వాలు ఎగుమతి ఆంక్షలు విధించకపోతే, ఆందోళన కొనుగోళ్లు లేకపోతే ధరలు కేవలం 10 నుంచి 20 శాతం వరకు మాత్రమే పెరుగుతాయన్నారు. మద్యస్థ ఉత్పత్తి నష్టాలు, ఆగ్నేయాసియా దేశాలు ముందు జాగ్రత్త చర్యగా నిల్వలు పెంచుకోవడం వల్ల ధరలు 30 నుంచి 50 శాతం వరకు ఎగిసే అవకాశం ఉందని చెప్పారు. తీవ్రమైన ఉత్పత్తి నష్టాలు, విస్తృతమైన ఎగుమతి నిషేధాలు, పానిక్ బైయింగ్ చోటు చేసుకుంటే మాత్రం గ్లోబల్ మార్కెట్‌లో బియ్యం ధరలు ఇప్పుడున్న ధరలకు రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ప్రపంచ బియ్యం మార్కెట్‌ను స్థిరీకరించడంలో భారత్ పాత్ర అత్యంత కీలమని అధ్యయనం స్పష్టం చేసింది. ఉత్పత్తి, ఎగుమతులు, ప్రభుత్వ ఆహార ధాన్యాల నిల్వల్లో భారత్ అగ్రగామిగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. అయితే, దేశీయ అవసరాలరీత్యా భారత్ మళ్లీ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే.. అది అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదలను మరింత వేగవంతం చేస్తుందని హెచ్చరించారు.
ఎలాంటి సంక్షోభాలనైనా ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సహకారం, పారదర్శకమైన వాణిజ్య విధానాలు, ఎప్పటికప్పుడు సరైన మార్కెట్ సమాచారం అందుబాటులో ఉండటం చాలా అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే నిత్యవసర ధరలు ఆకాశన్నంటుతున్న తరుణంలో ఇప్పుడు బియ్యం ధరలు కూడా పెరిగితే సామాన్యుల జీవనం కష్టతరమవుతుందని అంటున్నారు. ఇలా అయితే జీవించటం కష్టమేనని అంటున్నారు.పంట ఉత్పత్తి సాధారణంగా ఉండి, భారీ కొనుగోళ్లు జరగకపోతే ధరలు 10-20 శాతం వరకు మాత్రమే పెరగొచ్చని పేర్కొంది. అయితే ప్రస్తుతం ఎక్కువ అవకాశాలు ఉన్న పరిస్థితిలో.. మోస్తరు దిగుబడి తగ్గుదల, నిల్వల పెరుగుదల కారణంగా ధరలు 30-50 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఒకవేళ ఎగుమతి ఆంక్షలు, భయంతో భారీ కొనుగోళ్లు జరిగితే ప్రపంచ బియ్యం ధరలు రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రానున్న ఖరీఫ్ పంట ఆశించిన స్థాయిలో వస్తే బియ్యం ధరలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. అయితే ఎల్‌నినో ప్రభావం కొనసాగడం, నిల్వలు పెరగడం వంటి అంశాలు కొనసాగితే వినియోగదారులపై ధరల భారం మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )