ఖైరతాబాద్ తో పాటు హుజురాబాద్ కు ఉప ఎన్నిక
- బీఆర్ఎస్ కు గట్టి సవాల్
- పక్కా వ్యూహరచనలో కాంగ్రెస్
- తెలంగాణలో వేడెక్కతున్న రాజకీయం
విజేత, తెలంగాణ బ్యూరో : తెలంగాణాలో ఒక ఖైరతాబాద్ కే ఉప ఎన్నిక జరుగుతుందా? లేకుంటే మరో స్థానానికి సైతం జరగనుందా? ఇప్పుడు అంతటా ఇదే చర్చ. ఖైరతాబాద్ తో పాటు హుజురాబాద్ కు కూడా ఉప ఎన్నిక ఖాయమని వార్తలు వస్తున్నాయి. ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక తెచ్చి కాంగ్రెస్ పార్టీకి గులాబీ పార్టీ గట్టి సవాల్ విసిరింది. ఇప్పుడు హుజురాబాద్ కు ఉప ఎన్నిక తెచ్చి గులాబీ పార్టీని ఇరకాటంలో పడేయాలని అధికార కాంగ్రెస్ చూస్తోంది. ఈ రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మట్టి కరిపించి పూర్తిగా దెబ్బతీయాలని భావిస్తోంది. కోర్టుకు వెళ్లి దానం నాగేందర్ పై బీఆర్ఎస్ అనర్హత వేటు వేయించింది. కానీ స్పీకర్ ద్వారా పాడి కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేసి హుజురాబాద్ ఉప ఎన్నికకు తెరతీయాలని గట్టి ప్రణాళికతో ఉంది రేవంత్ రెడ్డి సర్కారు.సుప్రిం కోర్టు దాకా న్యాయపోరాటం చేసి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయించడంలో బీఆర్ఎస్ అధిష్ఠానం విజయం సాధించింది. ఇప్పటికి బీజేపీ అధికారికంగా మూడు సీట్లను కోల్పోయింది. ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోయారు. మూడో ఎమ్మెల్యే అనర్హతకు గురయ్యారు. మరో ఎమ్మెల్యేను కూడా తగ్గించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లక్ష్యంగా అనర్హత అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. ఒకే దెబ్బకు రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు తీసుకొచ్చి బీఆర్ఎస్ను ఆత్మరక్షణలోకి నెట్టాలన్నది రేవంత్ రెడ్డి సర్కార్ పక్కా ప్లాన్‌గా కనిపిస్తోంది.
*ఏం జరిగిందంటే..*
మార్చిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అనుచిత ప్రవర్తనను కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే శాసనసభ ప్రివిలేజ్ కమిటీ విచారణను ముమ్మరం చేసింది. సభా మర్యాదలు ఉల్లంఘించడం, అసెంబ్లీ సాక్షిగా తోటి సభ్యుడిని అవమానించేలా ప్రవర్తించడంపై కమిటీ నివేదికను సిద్ధం చేస్తోంది. ప్రివిలేజ్ కమిటీ ఇచ్చే సిఫారసుల ఆధారంగా కౌశిక్ రెడ్డిపై శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు లైన్ క్లియర్ అవుతోంది. సభా నియమావళి, శాసనసభ అంతర్గత క్రమశిక్షణ వ్యవహారాల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 212 ప్రకారం కోర్టులు నేరుగా జోక్యం చేసుకోలేవన్నది న్యాయ నిపుణుల స్పష్టమైన అభిప్రాయం.
*గతంలో కూడా ఇలాంటిదే..*
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనూ సరిగ్గా ఇలాంటి సంప్రదాయమే నడిచింది. ఉమ్మడి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సమయంలో హెడ్‌ఫోన్స్ విసిరేశారన్న కారణంతో కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. న్యాయస్థానాలు సైతం శాసనసభాపతి నిర్ణయాధికారాల పరిధిని పరిగణనలోకి తీసుకుంటూ తీర్పులు ఇచ్చాయి. ఇప్పుడు అదే అస్త్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తిరగేసి ప్రయోగించేందుకు పూర్తి కసరత్తు చేస్తోంది. దానం నాగేందర్ కేసులో టెన్త్ షెడ్యూల్ నిబంధనలతో కోర్టుల ద్వారా బీఆర్ఎస్ ముందడుగు వేస్తే, కౌశిక్ రెడ్డి విషయంలో అసెంబ్లీ విశేషాధికారాల కమిటీ నివేదిక ద్వారా కాంగ్రెస్ తన రాజకీయ పగను తీర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు పడితే.. తెలంగాణలో కేవలం ఖైరతాబాద్ మాత్రమే కాకుండా హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ ఉపఎన్నిక అనివార్యమవుతుంది. ఒకవైపు హైదరాబాద్ నగరంలో దానంపై వచ్చిన తీర్పును రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలో తెలియక బీఆర్ఎస్ తలమునకలవుతుండగా, మరోవైపు కరీంనగర్ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన హుజూరాబాద్ స్థానంలోనూ ఉపఎన్నికకు వెళ్లాల్సి రావడం గులాబీ పార్టీకి శరాఘాతమే అవుతుంది. దూకుడు ప్రదర్శిస్తున్న కౌశిక్ రెడ్డిని కట్టడి చేయడంతో పాటు, ఆ స్థానాన్ని తిరిగి చేజిక్కించుకుని బీఆర్ఎస్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అంతిమంగా, దానంపై వేటు వేయించి సంబరపడేలోపే.. హుజూరాబాద్ రూపంలో బీఆర్ఎస్కు కాంగ్రెస్ డబుల్ షాక్ ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.